Telugu Global
Telangana

ఆ పని చేస్తే టీఆర్ఎస్ ఉప ఎన్నికలో పోటీ చేయదు..

రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకోడానికి ఈనెల 13వరకు టైమ్ ఇస్తున్నామని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అప్పటి వరకూ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేయబోరని అన్నారు.

ఆ పని చేస్తే టీఆర్ఎస్ ఉప ఎన్నికలో పోటీ చేయదు..
X

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆ పని చేస్తే.. టీఆర్ఎస్ పోటీలో కూడా నిలబడదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తరపున ఇంకా నామినేషన్ వేయలేదని, రాజగోపాల్ రెడ్డి తమ సవాల్ స్వీకరిస్తే, తాము ఇక నామినేషన్ వేయబోమని అన్నారు. ఇంతకీ జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ ఏంటి..? మీరే చదవండి..

రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కి అమ్ముడుపోయారనేది బహిరంగ రహస్యం. నేరుగా టీవీ డిబేట్ లోనే ఆయన ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. తనకి ఎలాంటి కాంట్రాక్ట్ రాలేదని అంటున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంట్రాక్ట్ డబ్బుల్ని మునుగోడుకోసం ఇచ్చేస్తే టీఆర్ఎస్ తరపున పోటీ లేకుండా చేస్తామంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 18వేల కోట్ల రూపాయలకు మునుగోడు ఆత్మ గౌరవాన్ని అమ్మేసిన రాజగోపాల్ రెడ్డి, ఆ సొమ్ముని జేబులో వేసుకోకుండా నియోజకవర్గ అభివృద్ధికోసం ఖర్చు పెట్టాలన్నారు. అలా చేస్తానని హామీ ఇస్తే ఉప ఎన్నిక నుంచి టీఆర్ఎస్ తప్పుకుంటుందని అన్నారు.

13 వరకు డెడ్ లైన్..

రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకోడానికి ఈనెల 13వరకు టైమ్ ఇస్తున్నామని అన్నారు జగదీష్ రెడ్డి. ఆలోగా ఆయన కాంట్రాక్ట్ సొమ్ముని మునుగోడు నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విషయంలో మాటివ్వాలన్నారు. అప్పటి వరకూ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేయబోరని అన్నారు. 13వ తేదీ తర్వాత రాజగోపాల్ రెడ్డి తమ సవాల్ ని స్వీకరించలేదని తేలాక టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేస్తారని చెప్పారు.

అటు కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్ట్ వర్క్ తనకి రాలేదని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద గుండు సంజయ్ మీద ఒట్టు వేయాలని, లేదా యాదాద్రికి వచ్చి మోదీ మీద ఒట్టు వేయాలన్నారు. అలా ఒట్టు వేయకపోతే 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వదులుకోవాలని డిమాండ్ చేశారు.

First Published:  11 Oct 2022 5:19 PM IST
Next Story