Telugu Global
Telangana

ఎన్నికల పరిశీలకుల వల్లే ఫలితాలు ఆలస్యం - టీఆర్ఎస్

అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఓటమి ఖాయమైపోయిన వేళ బీజేపీ ఇలా అధికారులపై ఒత్తిడి చేసి రాద్ధాంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

ఎన్నికల పరిశీలకుల వల్లే ఫలితాలు ఆలస్యం - టీఆర్ఎస్
X


మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు మొదటి నాలుగు రౌండ్ లు జెట్ స్పీడ్ లో వచ్చాయి, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఒత్తిడి వల్లే ఎన్నికల అధికారి ఆలస్యంగా ఫలితాలు ప్రకటిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తాము ఫోన్ చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటిస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. దీనిపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఓటమి ఖాయమైపోయిన వేళ బీజేపీ ఇలా అధికారులపై ఒత్తిడి చేసి రాద్ధాంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారాయన.

ఎన్నికల పరిశీలకుల వల్లే ఆలస్యం..

రాష్ట్ర ఎన్నికల అధికారులతోపాటు, కేంద్రం నుంచి ఇద్దరు పరిశీలకులు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చారు. వారి వల్లే ఫలితాల ప్రకటన ఆలస్యమవుతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్ర ఎన్నికల పరిశీలకులు, బీజేపీ పరిశీలకుల్లాగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని, వారి వల్లే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు.

కేంద్ర పరిశీలకుల వల్ల ఫలితాలు ఆలస్యం అవుతుంటే.. బీజేపీ మాత్రం రాష్ట్ర అధికారులపై నెపం నెట్టాలని చూస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎన్నికల అధికారులపై ఒత్తిడి తేవాలని చూడటం సరికాదంటోంది. బీజేపీ ఓటమిని ఊహించిందని, అందుకే ఇలాంటి డ్రామాలాడుతోందన్నారు జగదీష్ రెడ్డి. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్ఎస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతి రౌండ్ పూర్తయిన వెంటనే వివరాలు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

First Published:  6 Nov 2022 6:25 AM GMT
Next Story