Telugu Global
Telangana

రేపు నిమ్స్‌లో రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు

రోబోటిక్ యంత్రాన్ని నిమ్స్‌లో ఇన్‌స్టాలేషన్ చేశారు. ఈ పరికరాన్ని సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.

రేపు నిమ్స్‌లో రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
X

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)ను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొత్త భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మరోవైపు రూ. కోట్లాది విలువైన పరికరాలను కూడా సమకూరుస్తున్నారు. తాజాగా రూ.48 కోట్లతో అత్యాధునిక పరికరాలను నిమ్స్ కోసం తెప్పించారు. రూ.31.5 కోట్ల విలువైన రోబోటిక్ యంత్రంతో పాటు.. రూ.16.5 కోట్ల విలువైన సర్జికల్ న్యూరో, సర్జికల్ యూరాలజీకి సంబంధించిన పరికరాలు ఉన్నాయి.

ఇప్పటికే రోబోటిక్ యంత్రాన్ని నిమ్స్‌లో ఇన్‌స్టాలేషన్ చేశారు. ఈ పరికరాన్ని సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. కొత్తగా వచ్చిన పరికరాల సాయంతో అన్ని రకాల శస్త్ర చికిత్సలతో పాటు.. న్యూరో, స్పైన్, క్యాన్సర్, గ్యాస్ట్రో, యూరాలజీకి చెందిన సర్జరీలు తక్కువ సమయంలో చేసే వీలుంటుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ యంత్రం సాయంతో కోత లేకుండా.. చిన్నపాటి రంధ్రాల ద్వారా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా పూర్తి చేసే వీలుంటుంది. డాక్టర్లు కూడా సులభంగా సర్జరీలు చేయవచ్చు. అంతే కాకుండా రోగికి ఎలాంటి రక్తస్రావం జరగదు. శస్త్ర చికిత్స చేసే సమయంలో రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం కూడా ఉండదు. నిమ్స్ చరిత్రలోనే ఇది ఖరీదైన యంత్రం. దీనిని సీఎం కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్‌గా తాము భావిస్తున్నట్లు బీరప్ప తెలిపారు.

నిమ్స్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్ యంత్రం.. ఇతర ఆసుపత్రుల్లో ఎక్కడా లేదు. యూరినరీ బ్లాడర్, రెక్టమ్ క్యాన్సర్ వంటి శస్త్ర చికిత్సలకు ఈ యంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రోబో యంత్రంతో చేసే ఆపరేషన్ల కచ్చితత్వం, సక్సెస్ రేట్ 90 శాతం వరకు ఉంటుంది. అంతే కాకుండా రోబోటిక్ సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్లు కూడా రావు. పేదలకు రోబోటిక్ యంత్రంతో చేసే చికిత్సలు అందుబాటులోకి రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 July 2023 8:32 AM IST
Next Story