ధరణి భేష్.. తెలంగాణ రైతుల స్పందన ఇది
రైతులు మాత్రం ధరణి విషయంలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి వల్ల తమకు ఉపయోగం ఉందని తెలిపారు అన్నదాతలు.
ఎన్నికల ఏడాదిలో తెలంగాణలో ధరణి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారనేది కాంగ్రెస్ వాదన. అయితే అవన్నీ రాజకీయ ఆరోపణలేనని, వాస్తవానికి ధరణి వల్ల దళారుల సమస్య తగ్గిపోయిందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ధరణిని వెటకారం చేస్తున్న కాంగ్రెస్ నే బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. అసలింతకీ ధరణి గురించి సామాన్యులు ఏమనుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకోడానికి మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆసక్మికంగా తనిఖీ చేశారు. రైతులను అడిగి అసలు విషయం తెలుసుకున్నారు.
తహశీల్దార్ కార్యాలయంలో రైతులతో నేరుగా మాట్లాడారు మంత్రి హరీష్ రావు. ధరణి గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు మాత్రం ధరణి విషయంలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి వల్ల తమకు ఉపయోగం ఉందని తెలిపారు అన్నదాతలు.
20నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్..
ధరణి వెబ్ సైట్ వల్ల 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతోందని మంత్రి హరీష్ రావుకి చెప్పారు రైతులు. హక్కు పత్రాలు అక్కడికక్కడే తమ చేతికి వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ధరణి వల్ల మ్యుటేషన్ ఇబ్బందులు తప్పాయని, ఈ ప్రయత్నం తమకు ప్రయోజనకారి అని అన్నారు. రైతులందరూ ధరణి గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారని, కేవలం ప్రతిపక్షాలే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి ఆయన హక్కు పత్రాలు అందజేశారు.