Telugu Global
Telangana

కాళేశ్వరంలో నీళ్లు లేవంటారా..? చెరువుల్లో ముంచండి..

అవాకులు చెవాకులు పేలుతున్నవారు మీ ఊరికొస్తే.. మీ ఊరి చెరువుల్లో వారిని ముంచేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు హరీష్ రావు. చెరువుల్లో ముంచితే వారికి నీరు ఉందో లేదో తెలిసిపోతుందన్నారు.

కాళేశ్వరంలో నీళ్లు లేవంటారా..? చెరువుల్లో ముంచండి..
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు మంత్రి హరీష్ రావు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారాయన. కాళేశ్వరం వల్ల చుక్క నీరు రాలేదని అంటున్న కేంద్ర మంత్రులకు తెలంగాణ ప్రజలు జ్ఞానోదయం కలిగించాలన్నారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని అంటున్న కాంగ్రెస్ నేతలకు కూడా గుణపాఠం చెప్పాలన్నారు. అవాకులు చెవాకులు పేలుతున్నవారు మీ ఊరికొస్తే.. మీ ఊరి చెరువుల్లో వారిని ముంచేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు హరీష్ రావు. చెరువుల్లో ముంచితే వారికి నీరు ఉందో లేదో తెలిసిపోతుందన్నారు. చేపలు పట్టుకోవ‌డానికి మత్స్యకారులు చెరువుల్లో నుంచి నీరు వదిలేయండి అని అడిగే పరిస్థితి ఉందన్నారు.

సిద్ధిపేట జిల్లాలోని సిద్దన్ పేటలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గతంలో ఈ ప్రాంతంలో యాసంగిలో బోరు బండ్లు కనిపించేవని, కానీ కాళేశ్వరం పూర్తయిన తర్వాత బోరు బండ్లు కనిపించడంలేదన్నారు. ఇది మన కాళేశ్వరం పుణ్యమే అని అన్నారాయన. ఢిల్లీలో కూర్చొని విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేతలకు హితవు పలికారు.

కాళేశ్వరంతో ఉపాధి కూడా..

ఇతర రాష్ట్రాలలో ఉపాధి లేక అక్కడినుంచి వలస కూలీలు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు హరీష్ రావు. తెలంగాణలో వరినాట్లు వేసేందుకు ఇతర రాష్ట్రాలనుంచి కూలీలు వస్తున్నారని చెప్పారు. వడ్లు లారీల్లో ఎక్కించడానికి బీహార్ నుంచి హమాలీలు వస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాల కూలీలకు తెలంగాణలో ఉపాధి దొరుకుతోందని, ఇదంతా కాళేశ్వరం ఫలితమేనన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కారు పింఛన్లు ఎంతంటే..?

కర్నాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు 200 రూపాయల పింఛన్ ఇస్తుంటే తెలంగాణలో 2వేలకుపైగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు.

First Published:  7 Sept 2022 1:09 PM GMT
Next Story