Telugu Global
Telangana

ఇటు నమ్మకం, అటు అమ్మకం.. ఏ గట్టునుంటారు..?

తెలంగాణలో ప్రతిపక్షాలు తిట్ల పురాణంలో పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కానీ సీఎం కేసీఆర్ పుట్ల కొద్దీ వడ్లు పండించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపడంలో పోటీ పడుతున్నారని చెప్పారు.

ఇటు నమ్మకం, అటు అమ్మకం.. ఏ గట్టునుంటారు..?
X

ప్రజల నమ్మకానికి కేసీఆర్ మారుపేరు అని అన్నారు మంత్రి హరీష్ రావు. అదే సమయంలో ప్రతిపక్షాలు అమ్మకానికి మారుపేరుగా మారాయని ఎద్దేవా చేశారు. ఇటు నమ్మకం, అటు అమ్మకం.. ఏ గట్టున ఉండాలో ప్రజలే తేల్చుకోవాలని మెదక్ సభలో పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు టికెట్లు, సీట్లు, పదవులు.. అన్నీ అమ్ముకుంటాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వారివి తిట్లు, మనవి పుట్లు..

తెలంగాణలో ప్రతిపక్షాలు తిట్ల పురాణంలో పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కానీ సీఎం కేసీఆర్ పుట్ల కొద్దీ వడ్లు పండించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపడంలో పోటీ పడుతున్నారని చెప్పారు. వారివి తిట్లు అయితే, మనవి పుట్లు అని అన్నారు. మెదక్ లో 4 లక్షల ఎకరాల్లో భూమి సాగు అవుతోందని దీనికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. కేసీఆర్ కష్టపడ్డారని, చెరువులు బాగు చేశారని, చెక్ డ్యామ్ లు కట్టారని, 24గంటలు కరెంటు ఇస్తున్నారని చెప్పారు. అసత్యాల మీద అభివృద్ధి గెలుస్తుందని, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు.


రానే రాదన్న తెలంగాణ సాధించి చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు హరీష్ రావు. రానే రావు అన్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఉమ్మడి మెదక్ ని సస్యశ్యామలం చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. తొమ్మిదేళ్లుగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 11 విడతల్లో 72వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన ఘనత కూడా ఆయనదేనని చెప్పారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు హరీష్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్‌ కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

First Published:  23 Aug 2023 1:51 PM GMT
Next Story