Telugu Global
Telangana

తొమ్మిదేళ్ల ప్రగతి యాత్ర.. నూరేళ్ల అభివృద్ధి

పధ్నాలుగేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు హరీష్ రావు.

తొమ్మిదేళ్ల ప్రగతి యాత్ర.. నూరేళ్ల అభివృద్ధి
X

జయజయహే తెలంగాణ, జననీ జయకేతనం అంటూ 9 సంవత్సరాల ప్రగతియాత్రను విజయవంతంగా పూర్తిచేసుకున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు. పసి రాష్ట్రంగా అవతరించి పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని తెలంగాణ సాకారం చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దశ, దిశ నిర్దేశించేలా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో తెలంగాణ ముందడుగు వేస్తుందని అన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

నూతన రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఎన్నో కీర్తికిరీటాలు సొంతం చేసుకుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పధ్నాలుగేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు హరీష్ రావు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థను, ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్ అంటూ ట్విట్టర్లో తన శుభాకాంక్షల సందేశం ఉంచారు మంత్రి హరీష్ రావు. అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్ అని కొనియాడారు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాయని, తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తున్నదని అన్నారు. అందుకే ’తెలంగాణ మాడల్‌’ దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతున్నదని చెప్పారు. అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే, స్వరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెంది సగర్వంగా దశాబ్ది సంబురం చేసుకొంటున్న చారిత్రక సందర్బం ఇది అని గుర్తు చేశారు హరీష్ రావు.



First Published:  2 Jun 2023 4:35 PM IST
Next Story