తుషార్ విషయంలో గవర్నర్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు : మంత్రి హరీశ్ రావు
మేం రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ గురించి మాట్లాడుతుంటే.. గవర్నర్ మాత్రం తన ఏడీసీ తుషార్ అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాలేదని హరీశ్ అన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వ్యవహారంలో బీజేపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యిందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారిలో మా నాయకులు లేరని, ఆ మఠాధిపతులకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడి బట్టలతో ప్రమాణాలు చేస్తారు. బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి విచారణ ఆపాలని కోర్టుల్లో కేసులు వేస్తారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు. ఈ మాజాక్ ఏంటని ఆయన బీజేపీ వైఖరిని ఎండగట్టారు.
బీజేపీ చేసిన దుష్ట రాజకీయంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. మేం రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ గురించి మాట్లాడుతుంటే.. ఆమె మాత్రం తన ఏడీసీ తుషార్ అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాలేదని హరీశ్ అన్నారు. ఆమె ఎందుకు పత్రికల్లో వచ్చే వార్తలు చూసి ఇలా స్పందించారో తెలియడం లేదన్నారు. ఒక ఘటన జరిగితే విచారణను వేగవంతం చేయాలని కోరాలి. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టుల చుట్టూ తిరుగుతూ విచారణను ఆపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తారు. కానీ, ఆ పార్టీ నాయకులు మాత్రం సిట్ విచారణ ఆపాలని మాట్లాడతారు. బీజేపీ పూట పూటకు మాట మారుస్తూ, నగ్నంగా పట్ట పగలే దొరికి పోయి ఇప్పుడు మాత్రం ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ పోలీసుల విచారణ వద్దని అంటున్న బీజేపీకి.. తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రం కావాలా? ఇక్కడి పోలీసులపై ఎందుకు నమ్మకం లేదని ప్రశ్నించారు.
దేశంలోని ఎనిమిది రాష్ట్రంల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన బీజేపీ.. తెలంగాణకు వచ్చి బొక్కా బోర్లా పడిందని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుల మాట్లాడే మాటలు చూస్తుంటే.. ఏదో ఉందని అనుమానంగా ఉందన్నారు. 'దాల్ మే కుచ్ నహీ.. బహుత్ జ్యాదా కాలా హై' అన్నారు. ప్రభుత్వం కచ్చితంగా నిష్పాక్షిక విచారణ జరుపుతుందని.. తప్పకుండా అన్ని విషయాలు బయటకు వస్తాయని హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.
రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు తమ విలువను దిగజార్చుకోకూడదు. వాళ్లు గౌరవం ఇస్తే.. మేం కూడా అలాగే చూస్తమని గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని కోరడానికి సబిత ఇంద్రారెడ్డి అక్కడకు వెళ్లారు. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు హరీశ్ తెలిపారు.