చంద్రబాబు ఆ పని చేస్తే మాకు ఫుల్ హ్యాపీ - హరీష్‌రావు
ఏపీని అప్పుల పాలు చేసి, అభివృద్ది చేయలేక ప్రజల చేత ఛీకొట్టించుకున్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఉద్ధరిస్తా అనడం చిత్రంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు.
చంద్రబాబు తీరు కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తా అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‌రావు. ఏపీని అప్పుల పాలు చేసి, అభివృద్ది చేయలేక ప్రజల చేత ఛీకొట్టించుకున్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఉద్ధరిస్తా అనడం చిత్రంగా ఉందన్నారు. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలు ఇచ్చేది అన్నట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు.
తెలంగాణ అత్యధికంగా దోపిడికి గురై, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సమయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలమేనన్నారు. తెలంగాణ అభివృద్ది గురించి ప్రశ్నించిన యువకులను నక్సలైట్ల పేరుతో ఎన్‌కౌంటర్లు చేయించి వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తెలంగాణలో కోడి కూస్తోంది అంటే అది కూడా తన వల్లనే అని చెప్పుకునే రకం చంద్రబాబు అని హరీష్ ఎద్దేవా చేశారు.
2018లోనూ ఇలాగే మహాకూటమి పేరుతో తెలంగాణపై కుట్ర చేయాలని చూస్తే ప్రజలు చిత్తు చేశారన్నారు. బీజేపీతో ఏపీలో పొత్తు కోసం తెలంగాణలో బలం ఉందని చూపేందుకే ఖమ్మంలో మీటింగ్ పెట్టి, పక్క రాష్ట్రం నుంచి జనాన్ని తెచ్చుకున్నారని హరీష్‌రావు విమర్శించారు. చంద్రబాబు తెలంగాణలో ఏ పక్షాన ఉంటే ఆ పక్షం చిత్తు అయిపోతుందని.. కాబట్టి భస్మాసుర హస్తం లాంటి చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమకు సంతోషమేనన్నారు. సొంత రాష్ట్రంలోనే చెల్లని చంద్రబాబు తెలంగాణలో చెల్లుతారా అని ప్రశ్నించారు. కరోనా వ్యాక్సిన్ కూడా తన వల్లే వచ్చిందని చెప్పుకుంటున్న చంద్రబాబును ఏమనాలో అర్థం కావడం లేదన్నారు హరీష్‌రావు.
బంగారు కడియం చూపి బాటసారిని మింగే పులి చంద్రబాబు!
అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే ఉచ్చరించడానికి వీల్లేదన్న చంద్రబాబు ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ఖమ్మం వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నిన్నటి మీటింగ్‌లో కూడా చంద్రబాబు నోట జై తెలంగాణ మాట రాలేదన్నారు. ఇప్పటికే తెలంగాణపైకి నలుగురు నేతలను బీజేపీ పెద్దలు వదిలారని ఇప్పుడు చంద్రబాబును కూడా దింపారన్నారు.
ఒక హైటెక్ సిటి భవనాన్ని నిర్మించి ఏదో అద్బుతం చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పుట్టిన 400 ఏళ్ల తర్వాత పుట్టిన చంద్రబాబు తానే హైదరాబాద్‌ను నిర్మించా అని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణపై అణచివేత నడిచిందన్నారు. పంచతంత్రం కథలో బంగారు కడియం చూపించి బాటసారిని మింగే పులిలాంటి వ్యక్తి చంద్రబాబు అని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.