Telugu Global
Telangana

తెలంగాణలో మైనార్టీబంధు.. లక్ష రూపాయల ఆర్థిక సాయం

బ్యాంకుల‌తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని తెలిపారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణలో మైనార్టీబంధు.. లక్ష రూపాయల ఆర్థిక సాయం
X

దళిత బంధు తరహాలోనే ఇటీవల బీసీ బంధుకూడా అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు ఈరోజు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకంపై రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తారని హరీష్ రావు పేర్కొన్నారు. జలవిహార్ లో జరిగిన మైనార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బ్యాంకులతో సంబంధం లేకుండా..

బ్యాంకుల‌తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని తెలిపారు మంత్రి హరీష్ రావు. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని, రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని చెప్పారు హరీష్ రావు. హిందువుల‌కు క‌ల్యాణ‌ లక్ష్మి అమ‌లు చేసిన‌ట్టే.. మైనార్టీల కోసం షాదీ ముబార‌క్ అమ‌లు చేస్తున్నామని గుర్తు చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ లో ఇంగ్లిష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉంద‌ని చెప్పారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నార‌ని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వ‌హించాల‌ని అడిగిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌రే అని తెలిపారు హరీష్ రావు. సల్వా ఫాతిమా అనే విద్యార్థిని పైలట్ అవుతానంటే.. వెంటనే సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించారని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తోందని చెప్పారు.

కాంగ్రెస్ వల్లే..

ముస్లింల అభివృద్ధి కోసం తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు హరీష్ రావు. మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. దేశంలో ఇప్ప‌టికీ ముస్లింలు పేద‌వారిగానే ఉన్నారని, గత కాంగ్రెస్ పాలనే దీనికి కారణం అని విమర్శించారు హరీష్ రావు. తెలంగాణ బడ్జెట్‌ రూ. 2,200 కోట్లు అని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో కూడా తెలంగాణ ప్రాంతానికి ఇంత బడ్జెట్ కేటాయించలేదని గుర్తు చేశారు.

First Published:  20 July 2023 4:04 PM IST
Next Story