Telugu Global
Telangana

తేడా చూడు బాబూ.. హరీష్ రావు సెటైర్లు

“దేశానికే ఏపీ అన్నం పెడుతుందని, తాను తినిపిస్తేనే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు అంటుండు.. ఇంకా నయం చార్మినార్ కూడా తానే కట్టానని అంటాడేమో.” అని అన్నారు హరీష్ రావు.

తేడా చూడు బాబూ.. హరీష్ రావు సెటైర్లు
X

ఇటీవల చంద్రబాబు వరి అన్నం గురించి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అన్నీ తానే చేశానని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. ఇంకా నయం చార్మినార్ కూడా కట్టించానని చెప్పుకోలేదు అంటూ సెటైర్లు పేల్చారు. “దేశానికే ఏపీ అన్నం పెడుతుందని, తాను తినిపిస్తేనే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు అంటుండు.. ఇంకా నయం చార్మినార్ కూడా తానే కట్టానని అంటాడేమో. ఏపీలో వరి సాగు 16 లక్షల ఎకరాల్లో జరిగితే.. తెలంగాణ లో 54 లక్షల ఎకరాల వరి నాట్లు వేశారు. సీఎం కేసీఆర్ కారణజన్ముడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.” అని అన్నారు హరీష్ రావు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మిషన్ కాకతీయ పథకం ద్వారా బీడు భూములన్నీ సాగు భూములయ్యాయి. ఏడాదికి ఒక పంటకే కష్టం అనుకునేవారు సైతం మూడు పంటలు పండిస్తున్నారు. సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. మరోవైపు రైతుబంధు కూడా అన్నదాతల కన్నీళ్లు తుడుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణ రైతులు కేసీఆర్ హయాంలో దిగులు లేకుండా ఉన్నారని చెప్పారు హరీష్ రావు.

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు..

తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు ఆహారంగా తీసుకునే వారని.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం పథకంతో తెలంగాణ ప్రజలు వరి అన్నం ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా హరీష్ రావు కూడా చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

First Published:  4 March 2023 8:59 AM IST
Next Story