అభివృద్ధి గెలవాలా..? అబద్ధం గెలవాలా..?
పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరని అన్నారు హరీష్ రావు. మూడోసారి కూడా తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని, ఇది ప్రజలు తీసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పారు.
కురుక్షేత్రంలో గెలిచింది పాండవులే కానీ, కౌరవులు కాదని అన్నారు మంత్రి హరీష్ రావు. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మమేనని, ధర్మం వైపు ఉన్న బీఆర్ఎస్సేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కౌరవుల పార్టీ అని విమర్శించారు. ఎన్నో అద్భుతమైన విజయాలతో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు హరీష్ రావు. అభివృద్ధి చేసిన పార్టీని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో 7,200 మంది మత్స్యకారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు హరీష్ రావు.
సిద్ధిపేట జిల్లాలో ఏడవ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హాజరయ్యారు. మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్ధిపేట చింతల్ చెరువులో మంత్రులిద్దరూ కలిసి 52 వేల చేప పిల్లలు వదిలారు. #bluerevolution #kcr #brsparty pic.twitter.com/R7gFKq6hb4
— Office of Harish Rao (@HarishRaoOffice) September 10, 2023
అంత అమాయకులేం కాదు..
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, ప్రతిపక్షాల మాయ మాటలు విని మోసపోరని అన్నారు మంత్రి హరీష్ రావు. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. గతంలో మత్స్యకారులకు సంఘాల్లో సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ గంగపుత్రులకు రాష్ట్రంలోనే మొదటిసారి గుర్తింపు కార్డులు సిద్దిపేటలో ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల సంక్షేమానికి 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువులలో సబ్సిడీపై చేప పిల్లలు వేసేవారని, నేడు రాష్ట్రంలోని అన్ని చెరువులలో ఉచితంగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల్ని వేస్తున్నామని చెప్పారు.
పూటకో దొంగ డిక్లరేషన్..
పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరని అన్నారు హరీష్ రావు. మూడోసారి కూడా తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు. ఇది ప్రజలు తీసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ అని అన్నారు. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ పెట్టి మరోసారి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లు పాలించి అధికారంలో ఉన్నప్పుడు ఆ అద్భుతాలన్నీ ఎందుకు చేయలేదని కాంగ్రెస్ ని నిలదీశారు హరీష్ రావు.