రుణమాఫీ సమస్యలు.. హరీష్ రావు పరిష్కారం
రుణమాఫీ పొందిన వారిలో కేవలం 35శాతం మందికే కొత్తగా రుణాలిచ్చారని తెలుస్తోందని మాఫీ పొందిన రైతులందరికీ రుణాలివ్వాలని చెప్పారు మంత్రి హరీష్ రావు. సెప్టెంబర్ పూర్తయ్యేలోగా ఆ పని పూర్తి చేయాలన్నారు. మొత్తం 18.79 లక్షల మంది రైతులకు రుణాలు రెన్యువల్ చేయాలన్నారు.
తెలంగాణలో ఇటీవలే రైతు రుణమాఫీ మలి విడత సాయం బ్యాంకుల్లో జమ అయింది. లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ సొమ్ముని ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. అప్పటికే రైతులు రుణాలు బ్యాంకులకు చెల్లించగా, ఆ సొమ్ముని ప్రభుత్వం తిరిగి వారికి బదిలీ చేసిందనమాట. అయితే వివిధ కారణాలతో కొంతమంది ఈ సొమ్ము అందుకోలేకపోయారు. అలాంటి వారు 1.6 లక్షలమంది ఉంటారని అంచనా. వారి సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్ రావు. తక్షణం వారికి కూడా రుణమాఫీ వెసులుబాటు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వారి అకౌంట్లలోకి బదిలీ కావాలని బ్యాంకర్లను ఆదేశించారాయన.
Hon’ble Minister Harish Rao Garu’s review at Dr. BR Ambedkar Secretariat: Minister Harish Rao said that loans below ₹1 lakh have been waived, highlighting our unwavering dedication to farmers. pic.twitter.com/OwmvhnbX3a
— Office of Harish Rao (@HarishRaoOffice) September 4, 2023
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 18,79,000 మంది రైతులకు రుణమాఫీ చేసింది. వారికోసం రూ.9654 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. 17,15,000 మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి. వివిధ కారణాలతో 1.64 లక్షల మందికి ఇంకా రుణమాఫీ లబ్ధి చేకూరలేదు. వీరికి కూడా వెంటనే ఉపశమనం కలుగజేయాలని బ్యాంకర్లను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. ఆధార్ నెంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. దీనివల్ల మరో లక్ష మందికి రుణమాఫీ డబ్బు అందుతుందని భరోసా ఇచ్చారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయశాఖ తరఫున జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందే..
అదే సమయంలో రుణ మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు. రుణమాఫీ పొందిన వారిలో కేవలం 35శాతం మందికే కొత్తగా రుణాలిచ్చారని తెలుస్తోందని మాఫీ పొందిన రైతులందరికీ రుణాలివ్వాలని చెప్పారు. సెప్టెంబర్ పూర్తయ్యేలోగా ఆ పని పూర్తి చేయాలన్నారు. మొత్తం 18.79 లక్షల మంది రైతులకు రుణాలు రెన్యువల్ చేయాలన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన 9,654 కోట్ల రూపాయలు తిరిగి కొత్త రుణాల రూపంలో రైతులకు చేరాలన్నారు హరీష్ రావు.