మునుగోడు దిశగా 200 కార్లు, 2 వేల బైక్ లు..
చోటా మోటా నాయకుల కోసం బీజేపీ కార్లు, బైక్ లు కూడా కొనుగోలు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా 200 బ్రీజా కార్లు, 2వేల మోటర్ సైకిళ్లకు బీజేపీ ఆర్డర్ ఇచ్చిందట.
మునుగోడు ఉప ఎన్నిక వెనక 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ లు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అక్రమ సంపాదన ఆ స్థాయిలో ఉంటే, ఉప ఎన్నికలో గెలుపు కోసం వారు ఎంత ఖర్చు పెడతారో ఊహించలేం. ఓటుకు నోటు తర్వాత ఓటుకి ముక్కు పుడక, వెండి గిన్నెలు వంటి వ్యవహారాలు కూడా వచ్చాయి. తాజాగా.. ఓట్లు వేయించేవారి కోసం, అంటే చోటా మోటా నాయకులకోసం బీజేపీ కార్లు, బైక్ లు కూడా కొనుగోలు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా 200 బ్రీజా కార్లు, 2వేల మోటర్ సైకిళ్లకు బీజేపీ ఆర్డర్ ఇచ్చిందట. వీటన్నిటినీ మునుగోడు పరిధిలో పంచి పెట్టేందుకే సిద్ధం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఈ వ్యవహారాలపై పార్టీ తరపున తాము నిఘా పెట్టబోతున్నట్టు తెలిపారు హరీష్ రావు.
కార్లు, బైక్ లకు బీజేపీ ఆర్డర్ ఇచ్చిన వ్యవహారంపై ఈసీకి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు హరీష్ రావు. మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారి ఆత్మ గౌరవానికి ఇది పరీక్ష అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, బీజేపీ చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదని ఎద్దేవా చేశారు. డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెంచిన బీజేపీకి ఏ నమ్మకంతో ప్రజలు ఓట్లు వేయాలని ప్రశ్నించారు హరీష్ రావు. కార్లు, బైక్ లు కాదు కదా, విమానాలు కొనిచ్చినా మునుగోడు ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని అన్నారు.
ధనమా..? ప్రజా స్వామ్యమా..?
మునుగోడులో గెలిచేది రాజగోపాల్ ధనమా? ప్రజాస్వామ్యమా? అనేది త్వరలోనే తేలిపోతుందని చెప్పారు హరీష్ రావు. తమ దగ్గర తాంత్రిక పూజలు లేవని, ఉన్నది కేవలం లోక్ తాంత్రిక్ మాత్రమేనని అన్నారు. బెనారస్ యూనివర్శిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సును తెచ్చింది బీజేపీయేనని అన్నారు హరీష్ రావు. అక్కడ బండి సంజయ్ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుందని చురకలంటించారు. వందే భారత్ రైళ్లు బర్రెలు అడ్డొస్తేనే తుక్కుతుక్కు అవుతున్నాయని, ఇకపై బీజేపీ నేతలు వందే భారత్ మాటలు మాట్లాడొద్దని అన్నారు. క్షుద్రపూజలంటూ బీజేపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు హరీష్ రావు.