Telugu Global
Telangana

మహారాష్ట్రలో బరాబర్ తెలంగాణ మోడల్

బీఆర్ఎస్ పార్టీది ప్ర‌జ‌ల టీమ్ అని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీమ్ అని చెప్పారు. త్వరలో షోలాపూర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి సభా వేదికల స్థలాలను హరీష్ రావు బృందం పరిశీలించింది.

మహారాష్ట్రలో బరాబర్ తెలంగాణ మోడల్
X

మహారాష్ట్రలో కచ్చితంగా తెలంగాణ మోడల్ అమలు చేసి తీరతామని అన్నారు మంత్రి హరీష్ రావు. షోలాపూర్ లో జరిగిన మార్కండేయ రథోత్సవంలో పాల్గొన్న ఆయన.. పద్మశాలీయుల ఆరాధ్య దైవం మార్కండేయ ఆలయ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున కోటి రూపాయల విరాళం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వందేళ్లుగా షోలాపూర్ లో మార్కండేయ రథోత్సవం జరుగుతోందని, అలాంటి ఉత్సవంలో ఈ ఏడాది తాను కూడా భాగస్వామి అయినందుకు గొప్ప అనుభూతి కలిగిందని చెప్పారు. ఆలయంలో బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ తప్పకుండా సహకరిస్తుందని చెప్పారు హరీష్ రావు.



మాది ప్రజల టీమ్..

బీఆర్ఎస్ పార్టీది ప్ర‌జ‌ల టీమ్ అని స్పష్టం చేశారు హరీష్ రావు. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీమ్ అని చెప్పారు. త్వరలో షోలాపూర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి సభా వేదికల స్థలాలను హరీష్ రావు బృందం పరిశీలించింది. షోలాపూర్ లోని బాల్‌ కోటి మైదానం, ఈద్గా మైదానాల‌ను మంత్రులు హ‌రీష్ రావు, మ‌హ‌మూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జి కల్వకుంట్ల వంశీధర్‌ రావు.. తదితరులు పరిశీలించారు.

రైతులు మావైపే..

మహారాష్ట్రలోని రైతులు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రైతులకు అందుతున్న సౌకర్యాలను చూసి అటువంటి విధానాలు తమకూ కావాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని, కానీ ఇక్కడి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ మోడల్ ని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తామే ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు హరీష్ రావు.

First Published:  31 Aug 2023 7:10 AM IST
Next Story