Telugu Global
Telangana

మంచిని చూడలేని మీరు చెడుని భూతద్దంలో చూస్తారా..?

గవర్నర్లు ప్రభుత్వానికి సలహాలివ్వొచ్చు కానీ, రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హరీష్ రావు. కంటివెలుగు గురించి కనీసం వైద్య సిబ్బందిని ఏనాడైనా గవర్నర్ మెచ్చుకున్నారా అని ప్రశ్నించారు.

మంచిని చూడలేని మీరు చెడుని భూతద్దంలో చూస్తారా..?
X

ఒక వైద్యురాలై ఉండి, తెలంగాణ వైద్యులు చేసిన కృషిని అభినందించాల్సిన గవర్నర్, రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు గవర్నర్ తమిళిసై చెడుని భూతద్దంలో చూపించాలనుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. చెడు చూస్తాం, చెడు చెప్తాం, చెడు వింటాం అని గవర్నర్ అంటే ఎట్లా? అని ప్రశ్నించారు హరీష్ రావు.

అసలేం జరిగింది..?

గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని అన్నారు గవర్నర్ తమిళిసై. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ‘జస్టిస్ ఫర్ OGH’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ని జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు గవర్నర్. ఆస్పత్రిలో రోగులు కొత్త భవనం లేక ఇబ్బంది పడుతున్నారంటూ కొన్ని ఫొటోలను కూడా జతచేశారు. ఈ ట్వీట్ తో కలకలం రేగింది. మంత్రి హరీష్ రావు, గవర్నర్ ట్వీట్ పై కాస్త ఘాటుగా స్పందించారు.


ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళి సై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని అన్నారు మంత్రి హరీష్ రావు. 2015లోనే నూతన బిల్డింగ్ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అయితే కోర్టులో స్టే ఉండటం వల్ల ఆ పని ముందుకు జరగలేదని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కోర్టు ఇండిపెండెంట్ కమిటీ వేసిందన్నారు. ఆ కమిటీ కూడా ఆస్పత్రి బిల్డింగ్ ని పడేయాలని రిపోర్ట్ ఇచ్చిందని, విషయం కోర్టు పరిధిలో ఉండటం వల్లే నూతన బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమవుతోందని వివరించారు.

గవర్నర్లు ప్రభుత్వానికి సలహాలివ్వొచ్చు కానీ, రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హరీష్ రావు. కంటివెలుగు గురించి కనీసం వైద్య సిబ్బందిని ఏనాడైనా గవర్నర్ మెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. మాతృమరణాలు, శిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ అగ్రభాగాన ఉందని, ప్రభుత్వ వైద్య శాలల్లో డెలివరీలు పెరిగాయని.. ఇవన్నీ గవర్నర్ కి కనిపించడంలేదా అన్నారు హరీష్ రావు. ఇంత మంచి జరుగుతుంటే ఒక్క మంచి మాట చెప్పడానికి గవర్నర్ కి మనసు రాలేదని విమర్శించారు.

First Published:  28 Jun 2023 4:20 PM IST
Next Story