Telugu Global
Telangana

మెడికల్ కాలేజీల విషయంలో బీజేపీ, కేంద్రంపై వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఫైర్

కేంద్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. ఇప్పటి వరకు మంజూరు చేసింది సున్నా అని హరీశ్ రావు అన్నారు.

మెడికల్ కాలేజీల విషయంలో బీజేపీ, కేంద్రంపై వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఫైర్
X

తెలంగాణ ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయినా సరే కేంద్రం మాత్రం మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోంది. గవర్నర్ తమిళిసై కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ట్వీట్లు చేయడంపై తెలంగాణ నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అసలు తెలంగాణకు ఎన్ని కాలేజీలు మంజూరు చేసిందో క్రాస్ చెక్ చేసుకోవాలంటూ ఘాటుగానే రిప్లయ్‌లు ఇచ్చారు. తాజగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం చేస్తున్న తప్పుడు ఆరోపణలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసలు నిజాలను బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వరుసగా ట్వీట్లు చేశారు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా జత చేశారు.

మెడికల్ కాలేజీల విషయంలో అసలు నిజాలు చెప్పాలి. కేంద్రానికి కాలేజీలు మంజూరు చేయాలని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. ఇప్పటి వరకు మంజూరు చేసింది సున్నా అని హరీశ్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత మూడు దశల్లో కూడా ఏనాడూ తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేదని.. రాష్ట్రంపై పూర్తిగా వివక్ష చూపిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు లేఖలు రాసినా.. కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం కాలేజీల విషయంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఒకరేమో మెడికల్ కాలేజీల కోసం ఎవరూ లేఖలు రాయలేదని చెబుతారు. మరొకరేమో కేవలం ఖమ్మం, కరీంనగర్ కోసం మాత్రమే వినతులు వచ్చాయని అంటారు. ఆయా జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నందునే మేము మంజూరు చేయలేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానిస్తారు. అసలు అక్కడ ఉన్నవి ప్రైవేటు మెడికల్ కాలేజీలు కదా.. మరెందుకు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనేది సీఎం విజన్. అందుకే ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించాము. దేశంలోనే ప్రతీ లక్ష మందికి 12 ఎంబీబీఎస్ సీట్లున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణపై అభాండాలు వేసే బదులు.. సొంతగా 8 కాలేజీలు ప్రారంభించకున్నందుకు అభినందించాలని ఆయన సలహా ఇచ్చారు.

కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన మెడికల్ కాలేజీల విషయంలోనే కాకుండా కేంద్రమే మంజూరు చేసిన ఎయిమ్స్ (బీబీనగర్)పై కూడా వివక్ష చూపిస్తోందని అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌తో సమానంగా అభివృద్ధి చేయాల్సిన బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులే మంజూరు చేయడం లేదన్నారు. ఎయిమ్స్‌కోసం రూ.1,365 కోట్లు మంజూరు చేసినా.. ఇప్పటి వరకు రూ.156 కోట్లు మాత్రమే విడుదల చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. అంటే మంజూరు చేసిన నిధుల్లో కేవలం 11.4 శాతమే విడుదల అయ్యిందని.. అదే గుజరాత్ ఎయిమ్స్ కోసం 52 శాతం నిధులను విడుదల చేసినట్లు హరీశ్ రావు చెప్పారు.




First Published:  5 March 2023 10:48 AM GMT
Next Story