కేంద్రం నిధులు ఆపడం వల్లే.. టీచర్ల జీతాలు ఆలస్యం : మంత్రి హరీశ్ రావు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరేడు ఏళ్లు ఒకటో తారీఖునే జీతాలు చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపడం వల్లే టీచర్లకు జీతాలు చెల్లించడంలో ఆలస్యం అవుతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కారిస్తామని ఆయన అన్నారు. విద్యాశాఖలోని ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యయ సంఘం (ఎస్టీయూ) 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం అయిన ఎస్టీయూ.. ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా.. విద్యార్థుల సమస్యల కోసం పోరాడిందని హరీశ్ గుర్తు చేశారు. ఈ సంఘం మరింత అద్భుతంగా ముందుకు వెళ్లాలని, ఉన్నత విద్యా బోధనకు కృషి చేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరేడు ఏళ్లు ఒకటో తారీఖునే జీతాలు చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఒకటో తేదీన జీతాలు వస్తుంటే.. ఇప్పుడు పదో తేదీన వస్తున్నాయని ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారు. డబ్బులు ఉండి మీకు ఇవ్వకుండా ఉంటామా? కావాలని ప్రభుత్వం జీతాలు ఎందుకు ఆపుతుందని అన్నారు. ఒక ఏడాది కాలంగా మాత్రమే ఈ సమస్య ఎదురవుతోందని మంత్రి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని, ఆర్థికంగా చాలా అడ్డంకులు పెడుతోందని అన్నారు. అసెంబ్లీలో రెండున్నర లక్షల కోట్లకు బడ్జెట్ పాస్ అయ్యింది. బడ్జెట్ పాస్ అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కోత పెట్టిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టడం లేదని రూ.12 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా కోత పెట్టిందని మంత్రి ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిన రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి హక్కుగా, వాటాగా రావల్సిన రూ.40వేల కోట్లను కేంద్రం నిలిపేసిందని హరీశ్ రావు మండిపడ్డారు.
దేశంలో అత్యధిక జీతాలు చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ఇక్కడి ఉపాధ్యాయులు ఎవరూ తీసుకోనంత వేతనాలు పొందుతున్నారు. వీలైనంత త్వరగా జీతాల సమస్యను పరిష్కారిస్తామని హరీశ్ రావు అన్నారు. కేంద్రం మోడల్ స్కూల్స్ రద్దు చేసింది. అయినా మనం కొనసాగించాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. అంగన్‌వాడీల ప్రమాణాలను పెంచి బలోపేతం చేసుకుంటున్నామని అన్నారు. గురు కుల పాఠశాలలను 1201కి పెంచుకున్నాం.. ప్రస్తుతం గురుకులాల కోసం రూ.3250కి కేటాయించామని అన్నారు. విద్యాశాఖకు కూడా భారీగా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ప్రతీ మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువే కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అందుకే ఉన్నత విలువలు నేర్పించేలా విద్యా బోధన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాంకుల కోసమే కాకుండా.. విలువలు, బాధ్యత కలిగిన విద్యార్థులను సమాజానికి అందించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
Speaking at Telangana state Teachers Union 75yrs of Celebrations at Vanasthali puram, Hyd. https://t.co/MoWxy8tl8k
— Harish Rao Thanneeru (@trsharish) December 24, 2022