Telugu Global
Telangana

ఐటీ టవర్ నా కల.. అది నిజమైంది

సిద్దిపేటలో సొంతంగా ఐటీ టవర్ పెట్టాలని అనుకునే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనువైన స్థలాన్ని కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఐటీ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు మంత్రి హరీష్ రావు.

ఐటీ టవర్ నా కల.. అది నిజమైంది
X

సిద్దిపేటకు ఐటీ టవర్ రావాలన్న తన కల నిజం కావడం.. అందులో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంటే.. ప్రజా ప్రతినిధికి మరింత శక్తి వస్తుందన్నారు. ఆ శక్తి తనను నడిపిస్తోందని చెప్పారు. సిద్దిపేట ఐటీ టవర్‌ లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి జాబ్ ఆఫర్ లెటర్స్ అందించిన మంత్రి హరీష్ రావు.. సిద్దిపేట హబ్ ఐటీ వెబ్ సైట్‌ ను ప్రారంభించారు.


సిద్ధిపేట ఐటీ టవర్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు వ‌చ్చేలా కృషి చేస్తాన‌ని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఫేజ్-1 పూర్తికాగానే ఫేజ్-2 ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK) ద్వారా సిద్ధిపేట ఐటీ టవర్‌ లో శిక్షణ తరగతులు బాగా జరుగుతున్నాయని తెలిపారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, ఇంజినీరింగ్ ప్రెషర్స్.. TASKలో చేరి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేటలో సొంతంగా ఐటీ టవర్ పెట్టాలని అనుకునే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనువైన స్థలాన్ని కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఐటీ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సిద్ధిపేట యువతలో చాలామంది సమర్థులైన వారు ఉన్నారని, వారికి తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 18 కంపెనీలకు ఎంపికైన ఉద్యోగులకు TASK ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటామని చెప్పారు.

First Published:  15 Aug 2023 7:50 PM IST
Next Story