ఈరోజు టెన్త్ పేపర్ ఎందుకు లీక్ కాలేదు..? హరీష్ రావు లాజిక్
‘చదువులు మేం చెప్పిస్తే.. బీజేపీ వాళ్లు పేపర్లు లీక్ చేశారు’ అని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. TSPSC వ్యవహారంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.
వరుసగా తెలంగాణలో లీక్ అయిన టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్లు ఈరోజు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. దొంగల్ని పట్టుకుని జైలులో వేయడం వల్లే పేపర్లు లీక్ కాలేదని ఆయనే సమాధానమిచ్చారు. లీక్ దొంగలు జైలులో ఉండటం వల్ల తెలంగాణలో పది పరీక్షలు సాఫీగా సాగాయని చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ నేతల కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు హరీష్ రావు.
చదువులు మేం చెప్పిస్తే..
‘చదువులు మేం చెప్పిస్తే.. బీజేపీ వాళ్లు పేపర్లు లీక్ చేశారు’ అని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. TSPSC వ్యవహారంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ వెనక కుట్రకోణం ఉందనడానికి తాజా ఉదాహరణే నిదర్శనం అని చెప్పారు. అరెస్ట్ అయిన బీజేపీ వాళ్లు జైలులో కూర్చునే సరికి ఈరోజు పేపర్ లీక్ కి అవకాశం లేకుండా పోయిందన్నారు.
కమలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పదోతరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రోద్బలంతోనే ఈ ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని పోలీసులు చెబుతున్నారు. అటు సంజయ్ మాత్రం తన తప్పేమీ లేదంటున్నారు. అదే సమయంలో ఆయన ఫోన్ మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.