Telugu Global
Telangana

ఖైదీ నెంబర్ 4170

తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్‌ వైపు ఉండాలని, ఓడాలంటే రేవంత్‌ రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ వైపు నిలవాలని చెప్పారు హరీష్ రావు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రిస్క్‌ తీసుకోవడం ఎందుకన్నారు.

ఖైదీ నెంబర్ 4170
X

తెలంగాణ వ్యతిరేకులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిత్యం స్నేహం చేస్తుంటారని అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకుండా కుట్రలు చేసిన వారందరూ ఇప్పుడు ఒక్కటయ్యారని చెప్పారు. అసలైన తెలంగాణ వ్యతిరేకి.. రేవంత్‌ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ని క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. అసలు క్రిమినల్ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చర్లపల్లి జైలులో రేవంత్ రెడ్డి ఖైదీగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఖైదీ నెంబర్ 4170 అని అన్నారు. చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డి ఖైదీ నెంబర్ 1779గా ఉన్నారని చెప్పారు. బెయిల్ మీద బయట తిరుగుతున్న రేవంత్ రెడ్డే అసలైన క్రిమినల్ అన్నారు హరీష్ రావు. రేవంత్‌ రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్‌ వైపు ఉండాలని, ఓడాలంటే రేవంత్‌ రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ వైపు నిలవాలని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్‌ కు ఓటేసి కర్నాటక ప్రజలు మోసపోయారని, అభివృద్ధిలో దేశానికే దిక్సూచి తెలంగాణ అని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రిస్క్‌ తీసుకోవడం ఎందుకన్నారు హరీష్.

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ ను భారీ మెజార్టీతో గెలిచించాలని కోరారు మంత్రి హరీష్ రావు. ఖర్గే సంగారెడ్డికి వస్తే ఆయన బహిరంగ సభకు జనాలెవరూ రాలేదని, మన బలం కళ్లముందే కనపడుతోందని చెప్పారు. మనం గట్టిగా కార్యరంగంలోకి దిగితే కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గాల్లో కొట్టుకుపోతాడని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో కొన్ని సర్వేలు వచ్చాయని, ఆ సర్వేలన్నీ హ్యాట్రిక్‌ సీఎం కేసీఆరే అని చెప్పాయని అన్నారు హరీష్ రావు. స్ట్రాంగ్‌ లీడర్‌ కేసీఆర్‌ ఉండగా రాంగ్‌ లీడర్లు మనకెందుకన్నారు.

First Published:  3 Nov 2023 8:17 PM IST
Next Story