Telugu Global
Telangana

న్యూట్రిషన్ పాలిటిక్స్ వర్సెస్ పార్టిషన్ పాలిటిక్స్

ఆశా వర్కర్లకు దేశంలోనే అత్యధిక వేతనం ఇవ్వడమే కాకుండా ఈ నెల నుంచి వారి ఫోన్ బిల్లులు సైతం ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు.

న్యూట్రిషన్ పాలిటిక్స్ వర్సెస్ పార్టిషన్ పాలిటిక్స్
X

బీఆర్ఎస్ వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అని, విపక్షాలు చేసేవి పార్టిషన్ పాలిటిక్స్ అని సెటైర్లు పేల్చారు మంత్రి హరీష్ రావు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చెందాలనేది బీఆర్ఎస్ లక్ష్యం అని, విభజించి పాలించడం, కుల మతాల పేరుతో ప్రజల్ని విడగొట్టి విద్వేషాలు నింపడం విపక్షాల టార్గెట్ అని మండిపడ్డారు. నాడు వేతనం పెంచాలని కోరిన ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ ది అని అన్నారు. నేడు తెలంగాణ ఆశా వర్కర్లు దేశంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్నారని వివరించారు. GHMC పరిధిలో కొత్తగా రిక్రూట్ అయిన 1500 మందికి పైగా ఆశా వర్కర్లకు శిల్పకళావేదికలో మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రభుత్వ విధానాలను వివరించారు.

ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వానివే..

ఆశా వర్కర్లకు దేశంలోనే అత్యధిక వేతనం ఇవ్వడమే కాకుండా ఈ నెలనుంచి వారి ఫోన్ బిల్లులు సైతం ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కూడా ఆశాలకు వేతనాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని చెప్పారాయన. పేదల సంక్షేమమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని, తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల పట్ల ప్రజల్లో భరోసా పెరిగిందని, దాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు హరీష్ రావు.

గతంలో ఎలాంటి అనారోగ్యం వచ్చినా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, బస్తీ దవాఖానాల్లో కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్‌ సూచనతో హైదరాబాద్‌ లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 3 ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ తో మాతా శిశు మరణాల రేటు తగ్గిందన్నారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌ లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని వివరించారు హరీష్ రావు.

First Published:  7 July 2023 4:47 PM IST
Next Story