Telugu Global
Telangana

మైనంపల్లి ఫ్యామిలీకి ఓటమి తప్పదు -హరీష్

మల్కాజ్ గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. ఆయన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు.

మైనంపల్లి ఫ్యామిలీకి ఓటమి తప్పదు -హరీష్
X

బీఆర్ఎస్ లో మల్కాజ్ గిరి లొల్లి ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. తనకు టికెట్ కేటాయించినా కూడా తన కొడుకు సీటుకోసం అలిగి పార్టీ ఫిరాయించారు సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అంతే కాదు మంత్రి హరీష్ రావుపై కూడా నిందలేశారు. ఆ విమర్శలన్నిటికీ ఇప్పుడు బదులిచ్చేశారు హరీష్. మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. మైనంపల్లి ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో ఉనికి కోల్పోవడం గ్యారెంటీ అన్నారు. హన్మంతరావు పోటీ పడుతున్న మల్కాజ్ గిరితోపాటు ఆయన కొడుకు పోటీ చేస్తున్న మెదక్ లో కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేల్చేశారు.


దత్తత తీసుకుంటా..

మల్కాజ్ గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. ఆయన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. 28 రోజులు కష్టపడండి చాలు, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని చెప్పారు. ఏ సర్వే చూసినా 75నుంచి 80 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెబుతున్నారని, నేతలు, కార్యకర్తలెవరూ అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.

రెండు నాల్కలా..?

కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డోడా అంటూ మైనంపల్లి పై మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషికి, ముఠాల మనిషికి మధ్య పోటీ అని చెప్పారు. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ రిజెక్టెడ్ నాయకులున్నారని ఎద్దేవా చేశారు. పోటీ చేసేందుకు నాయకులే లేరన్నారు.

First Published:  2 Nov 2023 6:36 PM IST
Next Story