Telugu Global
Telangana

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధి..

ఒక జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్, బీఆర్‌ఎస్‌ లదేనన్నారు మంత్రి హరీష్ రావు. కేంద్రం నిధులు విడుదల చేయకపోయినా తెలంగాణలో సంక్షేమం ఆపలేదన్నారు.

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధి..
X

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి హరీష్ రావు. చౌటుప్పల్‌ లో డయాలసిస్‌ సెంటర్ ను ప్రారంభించారాయన. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 5 పడకల డయాలసిస్‌ సెంటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. చౌటుప్పల్‌ లో క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలబడిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాలు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవన్నారు. తమిళనాడు కూడా ఈ విషయంలో తెలంగాణను ఆదర్శంగా తీసుకుందన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్‌ లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దామన్నారు. మరింత అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకువస్తామన్నారు.

కేంద్రం సహకారం శూన్యం..

మెడికల్, పీజీ సీట్లను పెంచి.. ఎంబీబీఎస్ చదువుకోసం తెలంగాణ బిడ్డలు విదేశాలకు వెళ్లకుండా చూశామని చెప్పారు హరీష్ రావు. నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో ఉద్యోగ కోర్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. బీబీనగర్‌ లో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కోసం 5కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చామని, అయితే అక్కడ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కేంద్రం కల్పించలేదని విమర్శించారు. భువనగిరి ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ సేవలు, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లు, గర్భిణులకు కావాల్సిన సేవలేవీ లేవన్నారు.

నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో 30 పడకల సిహెచ్‌సి ఆసుపత్రిని కూడా ప్రారంభించారు హరీష్ రావు. ఒక జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్, బీఆర్‌ఎస్‌ లదేనన్నారు మంత్రి. కేంద్రం నిధులు విడుదల చేయకపోయినా తెలంగాణలో సంక్షేమం ఆపలేదన్నారు. కేంద్రం నుండి రావలసిన నిధులు సకాలంలో రావడం లేదని ఆయన వెల్లడించారు. సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

First Published:  3 Jan 2023 7:28 PM IST
Next Story