Telugu Global
Telangana

ఈసీ అనుమతిస్తే వారం లోపే ఆ పని పూర్తి చేస్తాం

నర్సాపూర్‌ అంటే గులాబీ జెండా అడ్డా అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. 2001 నుంచి తెలంగాణ కోసం నడుం బిగించిన గడ్డ ఇదని తెలిపారు.

ఈసీ అనుమతిస్తే వారం లోపే ఆ పని పూర్తి చేస్తాం
X

రుణమాఫీ ఇంకా మిగిలి ఉండగానే ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న టైమ్ లో కాంగ్రెస్ కొర్రీవేయడంతో ఎన్నికల కమిషన్ రైతు రుణమాఫీ కుదరదంది. ఈసీ అనుమతిస్తే వారం లోపే రుణమాఫీ పూర్తి చేస్తామంటున్నారు మంత్రి హరీష్ రావు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే డిసెంబర్‌ 3 తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క రుపాయి లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.

నర్సాపూర్‌ అంటే గులాబీ జెండా అడ్డా అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. 2001 నుంచి తెలంగాణకోసం నడుం బిగించిన గడ్డ ఇదని తెలిపారు. ఉద్యమస్ఫూర్తితో ఈ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలిపునిచ్చారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రాణాలకు తెగించి పోరాడితేనే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌ పార్టీ మాట తప్పకపోయి ఉంటే వందల మంది పిల్లల ప్రాణాలు కాపాడగలిగే వాళ్లమని చెప్పారు. ఆ బలిదానాల వల్లే సోనియాను ఇటలీ బొమ్మ, బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కుర్చీ కోసం మాట మార్చారని మండిపడ్డారు.

ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కూడా ఎన్నికల వల్లే ఆలస్యమైందని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ లాంఛనం కూడా పూర్తి చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. రైతుబంధు రూ.16 వేలకు పెంచుతున్నామని, సామాజిక పెన్షన్‌ రూ.5 వేలు అవుతుందని, గ్యాస్‌ సిలిండర్‌ ను రూ.400కే అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు 3 గంటలే కరెంట్‌ చాలని, రైతుబంధు దుబారా అని, ధరణిని తీసేస్తామని మాట్లాడుతున్నారని, అలాంటి కాంగ్రెస్ కి ఓటేస్తే మళ్లీ రాష్ట్రం అంధకారమయం అవుతుందన్నారు హరీష్ రావు.

First Published:  17 Nov 2023 10:07 AM IST
Next Story