Telugu Global
Telangana

నేను, కేటీఆర్‌ మంచి స్నేహితులం..

కేటీఆర్ కు, తనకు సీఎం కేసీఆర్‌ చెప్పిందే భగవద్గీత అని అన్నారు. ఆయన ఏం చెప్పినా ఆచరిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది కేసీఆర్‌ నిర్ణయం అని, ఆయన ఎవరిని నియమించినా అంగీకరిస్తానని చెప్పారు హరీష్ రావు.

నేను, కేటీఆర్‌ మంచి స్నేహితులం..
X

నేను, కేటీఆర్‌ మంచి స్నేహితులం..

"నేను, కేటీఆర్‌ మంచి స్నేహితులం.." అని అన్నారు మంత్రి హరీష్ రావు. తమ మధ్య ఏదో ఉందని ప్రచారం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని, తామిద్దరం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం అని వివరించారు. పార్టీ బాగుండాలని, ప్రభుత్వం ఉత్తమ పాలన అందించాలని తపిస్తామన్నారు. కేటీఆర్ కు, తనకు సీఎం కేసీఆర్‌ చెప్పిందే భగవద్గీత అని అన్నారు. ఆయన ఏం చెప్పినా ఆచరిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది కేసీఆర్‌ నిర్ణయం అని, ఆయన ఎవరిని నియమించినా అంగీకరిస్తానని చెప్పారు హరీష్ రావు.

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడులను సానుభూతి కోసం తమ పార్టీయే చేసిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఇంత చిల్లరగాళ్లు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం అన్నారు. సానుభూతి కోసం ఎవరైనా కత్తితో పొడుచుకుంటారా? అని ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పేగును తొలిగించామని, తీవ్ర రక్తస్రావం అయ్యిందని డాక్టర్లు నివేదిక ఇచ్చినా విమర్శిస్తూనే ఉన్నారని, అలాంటి వారు మనుషులు కాదు పశువులు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గువ్వల బాలరాజు మీద కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ స్వయంగా రాళ్లు వేస్తున్న వీడియో చూశామని, బీఆరెస్సే దాడి చేస్తే ఆయన అక్కడెందుకు ఉన్నారని ప్రశ్నించారు హరీష్ రావు.

కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ కు లేదన్నారు హరీష్ రావు. తాము ఉద్యమంలో పాల్గొన్నామని, 200 కేసులు ఎదుర్కొన్నామని వివరించారు. పరోక్షంగా రాజకీయాల్లోకి రాలేదని, లక్ష ఓట్ల మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలిచామని చెప్పారు. ఎమ్మెల్సీ కవితపై ఉన్న కేసు కోర్టు స్టే వల్ల ఆగిపోందని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలని, ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు హరీష్ రావు.

సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్‌ లీడర్‌ అని, బీఆర్‌ఎస్‌ కు కేసీఆర్‌ లాంటి మంచి నాయకుడు ఉన్నారని చెప్పారు హరీష్ రావు. సీఎంగా కేసీఆర్‌ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ లో సీఎం సీటు కోసం మారణహోమం జరిగిన అనుభవాలున్నాయని, ఎవరికి వారే సీఎం అంటే.. అధిష్టానం మెప్పు కోసం, ఎమ్మెల్యేల మద్దతు కోసమే కాలం సరిపోతుందని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు.

First Published:  14 Nov 2023 11:09 AM IST
Next Story