ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు కేసీఆర్.. అందుకే ఆ ఆలోచన
హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో మెషిన్లను మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు ప్రారంభించారు.
తెలంగాణలో ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. అలా ఆలోచించారు కాబట్టే ఎవరూ అడగకముందే, బాధ్యత తీసుకుని కంటి సమస్యలను దూరం చేసేందుకు కంటి వెలుగు వంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి.. ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారు. 100 పని దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశామని, ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామని వివరించారు. 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందించామన్నారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కూడా ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, మందులు పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ కు తప్ప ప్రపంచంలో మరే ప్రభుత్వానికి లేదన్నారు హరీష్ రావు. కంటి పరీక్షల్లో తమది ఆల్ టైం రికార్డ్ అని చెప్పారు.
ఫ్యాకో మెషిన్లు ప్రారంభం..
హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో మెషిన్లను మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు ప్రారంభించారు. కాటరాక్ట్ సర్జరీల నిర్వహణలో ఈ అత్యాధునిక యంత్రాలు ఎంతో సహాయం చేస్తాయని అన్నారు హరీష్ రావు. అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో పనిచేసే ఫ్యాకో మెషిన్ల ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా, కచ్చితంగా చేయవచ్చన్నారు. ఫ్యాకో మెషిన్ల ద్వారా జరిగే సర్జరీ తర్వాత రోగులు కూడా త్వరగా కోలుకుంటారని చెప్పారు.
Minister Sri. @BRSHarish Participating in Virtual Inauguration of Phaco Machines at Sarojini Devi Eye Hospital pic.twitter.com/xSwcuwMQso
— Latha (@LathaReddy704) June 28, 2023
పేదలకు ఉచితంగా ఆపరేషన్లు..
ప్రైవేటు ఆస్పత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లకు 30వేలనుంచి 40వేల రూపాయల వరకు ఖర్చవుతుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఉచితంగా ఈ ఆపరేషన్లు చేస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ఫ్యాకో యంత్రాలను ఏర్పాటు చేశామని, అన్నిటినీ ఒకేసారి ప్రారంభించామని చెప్పారు. ఒక్కో ఫ్యాకో మెషిన్ ఖరీదు రూ.28.85 లక్షలు కాగా.. మొత్తం 12 యంత్రాలకోసం ప్రభుత్వం రూ.3.46 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన కంటి వెలుగు.. రెండు దఫాల్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు హరీష్ రావు.