ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారు, రేపు రాష్ట్రాన్ని అమ్మేస్తారు
గతంలో ములుగు జిల్లాలో ప్రభుత్వ వైద్యులు లేరనే ఫిర్యాదులు ఉండేవని, ఇప్పుడు ఏకంగా ములుగులో వైద్యులను తయారు చేసే మెడికల్ కాలేజీయే ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటోందని, రేపు రాష్ట్రాన్నే అమ్మేస్తుందని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. 10కోట్ల రూపాయల సొమ్ము, ఎకరం భూమికి పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకున్నారంటూ ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంపై ప్రేమ లేదని, అధికారంపై ప్రేమ ఉందన్నారు. వారికి కావాల్సింది పవర్ అని, దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని చెప్పారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ ది హ్యాట్రిక్ అని కుండబద్దలు కొట్టారు హరీష్ రావు.
టికెట్లు అమ్ముకున్న వాళ్ళు రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటరు. pic.twitter.com/unZUaZ6nD4
— Office of Harish Rao (@HarishRaoOffice) September 28, 2023
ములుగు, నర్సంపేటలో కొత్త మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. స్వతంత్రం వచ్చాక 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి కేవలం 2 మెడికల్ కాలేజీలు వస్తే, ఇప్పుడు తొమ్మిదేళ్లలో మొత్తం 29 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య విప్లవం సృష్టించారని అన్నారు. ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజ్, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సంపేటలో కూడా మెడికల్ కాలేజీకి భూమిపూజ చేశారు మంత్రి హరీష్.
గతంలో ములుగు జిల్లాలో ప్రభుత్వ వైద్యులు లేరనే ఫిర్యాదులు ఉండేవని, ఇప్పుడు ఏకంగా ములుగులో వైద్యులను తయారు చేసే మెడికల్ కాలేజీయే ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు హరీష్ రావు. వచ్చే ఏడాదికల్లా ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి 100మంది వైద్యులను నియమిస్తామని చెప్పారు. కల్యాణ లక్ష్మి పథకం అమలుకు స్ఫూర్తి ములుగు జిల్లాయేనన్నారు హరీష్ రావు. గుత్తూరు తండాలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధితుడు బిడ్డ పెళ్లికోసం దాచిపెట్టుకున్న నగదు కూడా తగలబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ఆ కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారని, ఆ సంఘటనే కల్యాణ లక్ష్మి పథకానికి బీజం వేసిందని చెప్పారు. కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఇప్పటి వరకు 12 లక్షల మంది అర్హులకు, రూ. 11 వేల కోట్లు కల్యాణ లక్ష్మి ద్వారా అందించామని చెప్పారు మంత్రి హరీష్. పోడు భూముల విషయంలో 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని అన్నారు. అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నాడు ఎన్ కౌంటర్లు, రైతు చావులు, ఎరువుల కొరత, కరెంట్ కొరత ములుగులో ఉండేవని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు మంత్రి హరీష్ రావు.