Telugu Global
Telangana

కాంగ్రెస్ సీఎం అభ్యర్థులపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరుగుతుందని, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పారు హరీష్ రావు.

కాంగ్రెస్ సీఎం అభ్యర్థులపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం, కాదు నేనే సీఎం అంటూ చాలామంది తమ మనసులో మాట బయటపెడుతున్నారు. రేసులో నేను కూడా ఉన్నానంటూ నాయకులు తమ పేర్లు తామే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులపై సెటైర్లు పేల్చారు. ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ, ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి, జానారెడ్డి సహా చాలామంది సీఎం కావాలని కలలు కంటున్నారని.. పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే కొట్లాటలు, కుట్రలు, కర్ఫ్యూలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

రియల్ ఎస్టేట్ ఢమాల్..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరుగుతుందని, అందుకే రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పారు హరీష్ రావు. భూముల రేట్లు పడిపోతాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్.. కొంతమంది కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవని చెప్పారు. కర్నాటకలో మోసపోయిన రైతులు ఇక్కడికి వచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై బాలీవుడ్‌ హీరో, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌ ప్రశంసలు కురిపించడంపై స్పందించారు మంత్రి హరీష్ రావు. గతంలో రజినీకాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పక్కన ఉన్న రజినీలకు ఇక్కడి అభివృద్ధి కనిపిస్తుంది కానీ, ఇక్కడ ఉన్న గజినీలకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.

రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్, రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పారు. వాళ్లు రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం అని వివరించారు. అయితే జైత్ర యాత్ర, లేదంటే నా శవయాత్ర అని చావుకి ఎదురెళ్లి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, జిల్లాకో మెడికల్‌ కాలేజీ వంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు హరీష్ రావు.

First Published:  25 Oct 2023 10:29 PM IST
Next Story