Telugu Global
Telangana

కార్పొరేట్ తరహా వైద్యం ఉచితంగానే..

గత ప్రభుత్వాలు ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ MNJ ఆస్పత్రి స్వరూపాన్ని మార్చేశారని చెప్పారు హరీష్ రావు.

కార్పొరేట్ తరహా వైద్యం ఉచితంగానే..
X

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు. కేన్సర్ చికిత్సలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోని MNJ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్‌ ను ఆయన ప్రారంభించారు. ఇందులో రోబోటిక్ సర్జికల్ సిస్టం ఖరీదు రూ.32 కోట్లు కాగా లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ని రూ.50 లక్షల వ్యయంతో సమకూర్చారు. ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు హరీష్ రావు.


అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలతో దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రిగా MNJ నిలిచిందని చెప్పారు హరీష్ రావు. రూపాయి ఖర్చు లేకుండా బోన్ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్ ఇక్కడ చేస్తారని తెలిపారు. కేన్సర్ రోగులకోసం పాలియేటివ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. అవసరమైన వారికి ఇంటివద్దకే వచ్చి పాలియేటివ్ సేవలు అందిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటుకి ముందు MNJ ఆస్పత్రిలో 3 ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉండేవని, అవి కూడా దాదాపుగా 60 సంవత్సరాల క్రితం నిర్మించినవని చెప్పారు హరీష్ రావు. గత ప్రభుత్వాలు ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ MNJ ఆస్పత్రి స్వరూపాన్ని మార్చేశారని చెప్పారు హరీష్ రావు. ప్రస్తుతం 8 అధునాతన రోబోటిక్ సహా మరో 8 మాడ్యులర్ థియేటర్లను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. 350 పడకలతో కొత్త బ్లాక్ ప్రారంభించామన్నారు. మొత్తం 750 పడకలతో దేశంలో అతిపెద్ద కేన్సర్ ఆస్పత్రిగా MNJ రికార్డ్ నెలకొల్పిందని చెప్పారు. దేశంలోనే తొలిసారి MNJ ఆధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ ప్రారంభిస్తామని వెల్లడించారు. MNJ ఆస్పత్రిని రూ.120 కోట్లతో స్టేట్ కేన్సర్ సెంటర్‌గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు హరీష్ రావు.

First Published:  18 Sept 2023 7:02 PM IST
Next Story