బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే గిరిజన బంధు..
తెలంగాణ ఎన్నికల్లో ఒక వైపు మాట తప్పిన కాంగ్రెస్, మరో వైపు మాట మీద నిలబడిన కేసీఆర్ ఉన్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఈ ఎన్నికల్లో గిరిజన ప్రజాప్రతినిధులందరూ కొమరం భీమ్ పోరాట పటిమ చూపాలన్నారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని గిరిజనులకు 'గిరిజన బంధు' పథకం అమలు చేస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ఒక్కరేనని వివరించారు. కాంగ్రెస్ పాలనలో గిరిజనులు ఎన్ని అగచాట్లు పడ్డారో గుర్తు చేసుకోవాలన్నారు. కనీసం తండాలను గ్రామపంచాయతీలుగా కూడా కాంగ్రెస్ చేయలేదని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనతో తండాలన్నీ గ్రామపంచాయతీలు అయ్యాయని గుర్తు చేశారు హరీష్ రావు.
తెలంగాణ ఎన్నికల్లో ఒక వైపు మాట తప్పిన కాంగ్రెస్, మరో వైపు మాట మీద నిలబడిన కేసీఆర్ ఉన్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో నిర్వహించిన స్థానిక సంస్థల గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గిరిజన ప్రజాప్రతినిధులందరూ కొమరం భీమ్ పోరాట పటిమ చూపాలన్నారు. సేవాలాల్ మహరాజ్ వారసత్వ మహిమ ఏంటో చూపించాలని చెప్పారు. హథీరామ్ బావాజీ వారసులైన గిరిజన నేతలు, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అండగా నిలబడి కృతజ్ఞత చూపించాలన్నారు హరీష్ రావు.
తాగునీరు, పోడు పట్టాలు, సౌకర్యాలు..
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గిరిజనులకు జరిగిన మేలుని వివరించారు మంత్రి హరీష్ రావు. గతంలో తాగునీటి కోసం గిరిజనులు అనేక ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు సైతం తాగునీరు అందుతోందని చెప్పారు. 4లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలిచ్చామన్నారు. సేవాలాల్, కొమరం భీమ్ జయంతి, సమ్మక్క-సారక్క పండుగను అధికారికంగా నిర్వహించుకుంటున్నామన్నారు. రూ.4వేల కోట్లతో గ్రామాల్లో రోడ్లు వేశామని, 2లక్షల ర్యాంకు వచ్చినా గిరిజన బిడ్డలకు వైద్య కళాశాలల్లో సీట్లు వచ్చాయని చెప్పారు. అన్ని గ్రామాల్లో బంజారా, కొమరం భీమ్ భవనాలను నిర్మించుకుంటున్నామని అన్నారు హరీష్ రావు.