మంత్రి గంగులకు హైకోర్టులో ఊరట
పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇదే విషయంపై మరో ప్రత్యర్థి బండి సంజయ్ వేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగాల్సి ఉంది.
తెలంగాణ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అభ్యర్థి గంగుల కమలాకర్ కు హైకోర్టులో ఊరట లభించింది. గంగుల అనర్హత పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. ఈ కేసు 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఆ ఎన్నికల్లో గంగుల కమలాకర్ నిర్దేశించిన మొత్తం కంటే అధికంగా ఎన్నికల్లో ఖర్చుపెట్టారంటూ ప్రత్యర్థులు కోర్టుకెక్కారు. పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇదే విషయంపై మరో ప్రత్యర్థి బండి సంజయ్ వేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగాల్సి ఉంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గంగుల కమలాకర్ విజయం సాధించారు. తదనంతర కాలంలో ఆయన మంత్రి అయ్యారు. అయితే గంగుల కమలాకర్ నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ ఆయన ప్రత్యర్థులిద్దరూ విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఆ పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. ఇక బండి సంజయ్ వేసిన పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. రేపు ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి తిరిగి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఈసారి పొన్నం స్థానంలో పురుమల్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.