Telugu Global
Telangana

మేడారం మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి.. ఫిబ్రవరి 1నుంచి మొదలు

Mini Medaram Jatara 2023 dates:మినీ జాతరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న మండ మెలిగే పండగ నిర్వహిస్తారు. తర్వాతి రోజు సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు.

Mini Medaram Jatara to begin on February 1 in Telangana
X

మేడారం మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి.. ఫిబ్రవరి 1నుంచి మొదలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మినీ జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే వన దేవతల మినీ జాతర ఈసారి మరింత ఘనంగా జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ వన జాతర ఘనంగా జరుగుతుంది. మధ్యలో ఏడాది మినీజాతర పేరుతో గద్దెలను శుద్ధి చేసే కార్యక్రమం చేపడతారు.


రెండేళ్లకోసారి జరిగే ప్రధాన జాతరకు ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వస్తారు. మినీ జాతరకు కేవలం మేడారం చుట్టుపక్కల గిరిజనులు మాత్రమే వస్తారు. కానీ కాలక్రమంలో మినీ జాతరకు కూడా భక్తలు పోటెత్తుతున్నారు. దీంతో మినీ జాతరను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది.

ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఈ మినీ జాతర ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు. మినీజాతర ఏర్పాట్లపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం భక్తుల సౌకర్యార్థం మేడారంలో 3.10 కోట్ల రూపాయల ఖర్చుతో వసతి సౌకర్యాలు మెరుగుపరిచామని తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, రహదారుల మరమ్మతులు, వైద్య శిబిరాల కోసం వీటిని వెచ్చించినట్టు చెప్పారు.

మినీ జాతరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న మండ మెలిగే పండగ నిర్వహిస్తారు. తర్వాతి రోజు సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు. ఆ తర్వాత భక్తులు తమ మొక్కలను తీర్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకొని రారు. మిగతా పూజా కార్యక్రమాలు మాత్రం యధావిధిగా జరుగుతాయి.

First Published:  24 Jan 2023 11:30 AM IST
Next Story