Telugu Global
Telangana

కేసీఆర్ కి రుణపడి ఉంటాం.. సమ్మె లేదన్న అంగన్వాడీలు

ప్రధాన అంగన్వాడీలుగా మినీ అంగన్వాడీలను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్ కి తాము రుణపడి ఉంటామని చెబుతున్నారు అసోసియేషన్ నేతలు.

కేసీఆర్ కి రుణపడి ఉంటాం.. సమ్మె లేదన్న అంగన్వాడీలు
X

తెలంగాణలో అంగన్వాడీలు సమ్మెకు దిగుతున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆ సంఘం నేతలు ఖండించారు. మినీ అంగన్వాడీలు తమ డిమాండ్లకోసం సమ్మె చేపడుతున్నారనే వార్తల్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. సమాచార లోపంతో కొంతమంది సమ్మెకు వెళ్లబోతున్నారని, అలాంటివారు తమ ప్రయత్నం విరమించుకోవాలన్నారు. సమ్మె చేయాల్సిన అవసరం లేదని, తమ అవసరాలను గుర్తించి న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామని తెలిపారు.

మినీ అంగన్వాడీల అప్ గ్రేడ్..

తెలంగాణలో 3,989 మంది మినీ అంగన్వాడీలు పని చేస్తున్నారు. వీరికి జీతాలు తక్కువ. ప్రధాన అంగన్వాడీలతో పోల్చి చూస్తే ఇతర అలవెన్స్ లలో కూడా పరిమితి ఉంటుంది. దీంతో వీరందర్నీ ప్రధాన అంగన్వాడీలుగా అప్ గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు ఆలస్యం కావడంతో మినీ అంగన్వాడీలు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలుగా తమను అప్‌ గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ నేతలు పేర్కొన్నారు. మినీ అంగన్వాడీలు ఎలాంటి సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ కి రుణపడి ఉంటాం..

ప్రధాన అంగన్వాడీలుగా మినీ అంగన్వాడీలను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్ కి తాము రుణపడి ఉంటామని చెబుతున్నారు అసోసియేషన్ నేతలు. అంగన్వాడీలకు సమస్యలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని, సమ్మె అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు. తమను పిలిచి అన్నం పెట్టి, పీఆర్సీ ఇచ్చి, ఇబ్బంది లేకుండా చూస్తున్న సీఎం కేసీఆర్‌ ను తాము సంపూర్ణంగా నమ్ముతామని ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని యూనియన్లు ఉనికి కోసం అంగన్వాడీలకు మాయమాటలు చెబుతున్నాయని, వారిని ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు.

First Published:  11 Sept 2023 11:40 AM IST
Next Story