అమిత్ షా కన్ను పడింది.. కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి
అమిత్ షా నెలలో రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉంటూ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారని ఒవైసీ వెల్లడించారు.
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాగాకు బీజేపీ భారీ స్కెచ్ వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో తన ప్రణాళిక అమలు చేసేందుకు అమిత్ షా నేరుగా హైదరాబాద్‌లోనే మకాం పెట్టబోతున్నారని చెప్పారు. ఇందుకోసం శంషాబాద్ వద్ద అమిత్ షా ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నారని వివరించారు. ఆ ఇంటిని ఒక పెద్ద వ్యాపారి నిర్మించి ఇచ్చారన్నారు. అమిత్ షా నెలలో రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉంటూ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారని ఒవైసీ వెల్లడించారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్ట్రీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఒవైసీ కొట్టిపారేశారు. స్ట్రీరింగ్ తమ చేతుల్లో ఉంటే పాతబస్తీలో అభివృద్ధి మరోలా ఉండేదన్నారు. హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటున్న బండి సంజయ్ దమ్ముంటే చైనా మీద చేయాలని సవాల్ చేశారు.