మహిళా బిల్లుని వ్యతిరేకించిన ఎంఐఎం.. ఎందుకంటే..?
దేశంలో ముస్లిం మహిళల జనాభా 7 శాతం ఉందని, కానీ లోక్ సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 0.7 శాతం మాత్రమే ఉందన్నారు ఒవైసీ. ముస్లిం మహిళలు చదువులో కూడా వెనకబడి ఉన్నారని.. వారికి రిజర్వేషన్ సద్వినియోగం కావాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తోందని లోక్ సభలో తెలిపారు ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బిల్లులో కొన్ని లోపాలున్నాయని అన్నారాయన. ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒవైసీ.
ఆ సవరణలు చేయాల్సిందే..
ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుని యధాతథంగా అమలుచేయడానికి తాము వ్యతిరేకం అని కుండబద్దలు కొట్టారు అసదుద్దీన్ ఒవైసీ. దేశంలో ముస్లిం మహిళల జనాభా 7 శాతం ఉందని, కానీ లోక్ సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 0.7 శాతం మాత్రమే ఉందన్నారు. ముస్లిం మహిళలు చదువులో కూడా వెనకబడి ఉన్నారని.. వారికి రిజర్వేషన్ సద్వినియోగం కావాలని కోరారు.
ఉపకోటా లేకపోతే అన్యాయం..
కేవలం ధనవంతులు, ఉన్నత వర్గాల మహిళలకే ఈ బిల్లు ద్వారా పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు ఒవైసీ. ఉపకోటా లేకపోతే బిల్లు ప్రవేశపెట్టడం వృథా అని చెప్పారు. అగ్రవర్ణాల మహిళలను మాత్రమే మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందని విమర్శించారాయన. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని తీవ్ర ఆరోపణలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.