కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ సవాల్
రేవంత్ రెడ్డి RSS నుంచి రాలేదని.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలంటూ సవాల్ విసిరారు.
కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నేతల మాటలపై ఘాటుగా స్పందించారు. పాతబస్తీ బండ్లగూడలో సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ టు పీజీ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌ను అక్బరుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై రెచ్చిపోయారు అక్బరుద్దీన్. రెడ్డి అయినా, రావు అయినా అందరితోనూ మజ్లిస్ పని చేయిస్తుందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితోనూ పని చేయించామని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి MIMకు సారీ చెప్పారన్నారు.
మేం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పాలంటూ కొందరు అడుగుతున్నారన్న అక్బరుద్దీన్.. తను, తన తండ్రి, తన తాత ఇక్కడే పుట్టామని చెప్పారు. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు అక్బరుద్దీన్. రేవంత్ రెడ్డి RSS నుంచి రాలేదని.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలంటూ సవాల్ విసిరారు.
మమ్మల్ని కించపరిస్తే ఏ మాత్రం సహించేది లేదన్నారు అక్బరుద్దీన్. బీజేపీ, సంఘ్ పరివార్, RSS, శివసేన పార్టీలు ముస్లింలకు శత్రువులన్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద రెడ్డి, బాబు, రావు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితోనూ పని చేయించుకునే జిమ్మిక్కులు తమ దగ్గర ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ ఉన్నందునే ముస్లింలపై దాడులు జరగడం లేదన్నారు. హిందూ, సిక్కు, క్రైస్తవులకు ఎవ్వరికీ వ్యతిరేకం కాదన్నారు. అన్ని మతాలవారికి దారుసలాం దర్వాజాలు తెరిచే ఉంటాయన్నారు.