Telugu Global
Telangana

అప్పుల పేరుతో తెలంగాణ పరువు తీయొద్దు - అక్బరుద్దీన్

బీఆర్ఎస్ సర్కార్ రుణాలు తీసుకున్నప్పటికీ.. రాష్ట్రం అనేక రంగాల్లో పురోగతి సాధించిందన్నారు ఓవైసీ. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పెద్దపీట వేసిందన్నారు.

అప్పుల పేరుతో తెలంగాణ పరువు తీయొద్దు - అక్బరుద్దీన్
X

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రంపై మాట్లాడిన MIM నేత అక్బరుద్దీన్ ఓవైసీ.. రిపోర్టులోని లోపాలను ఎత్తిచూపారు. శ్వేతపత్రం తయారీ కోసం RBI, కాగ్‌, బడ్జెటింగ్ బ్రీఫ్ బుక్‌లు వినియోగించారని.. వారి ఎజెండాకు అనుకూలంగా ఉన్న లెక్కలను మాత్ర‌మే శ్వేతపత్రంలో చూపారని చెప్పారు. ఒక పేజీలో ఉన్న లెక్కలు మరో పేజీతో సరిపోలడం లేదన్నారు అక్బరుద్దీన్. సభ్యులు ఏ లెక్కలను ఫాలో కావాలో చెప్పాలని ప్రశ్నించారు.

తాను ఎవరినో కాపాడటానికి ఇక్కడ లేనన్నారు అక్బరుద్దీన్. తాను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకే ఇక్కడ ఉన్నానని చెప్పారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని.. తెలంగాణ ఊబిలో కూరుకుపోయిందని సభ నుంచి పెట్టుబడిదారులకు సందేశం పంపడం సరికాదన్నారు అక్బరుద్దీన్. అధికార పార్టీ విధానంలో స్థిరత్వం లేదని విమర్శించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆర్బీఐ కూడా చెప్పిందన్న విషయాన్ని అక్బరుద్దీన్ గుర్తుచేశారు.

బీఆర్ఎస్ సర్కార్ రుణాలు తీసుకున్నప్పటికీ.. రాష్ట్రం అనేక రంగాల్లో పురోగతి సాధించిందన్నారు ఓవైసీ. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పెద్దపీట వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, బకాయిల విషయం శ్వేతపత్రంలో ఉంటాయని భావించామన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపైనా శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు అక్బరుద్దీన్. ఎలాంటి షరతులు లేకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరారు. రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్తున్నారని.. ఒక్కో గ్యారెంటీలో ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా స్కీమ్‌లు ఉన్నాయని.. కేవలం ఏ స్కీమ్‌ అమలు చేసి గ్యారెంటీ పూర్తిగా అమలు చేశామనడం సరికాదన్నారు.

First Published:  20 Dec 2023 7:45 PM IST
Next Story