Telugu Global
Telangana

సీఐదే తప్పు.. అతడిని సస్పెండ్ చేయాలి.. - అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవాళ సంతోష్ నగర్ పోలీసులు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 353తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.

సీఐదే తప్పు.. అతడిని సస్పెండ్ చేయాలి.. - అక్బరుద్దీన్ ఓవైసీ
X

లలితాబాగ్ ఘటనలో తన తప్పు ఏమీ లేదని.. పోలీసు ఇన్‌స్పెక్టర్‌దే తప్పు అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వివరణ ఇచ్చారు. నిన్న రాత్రి చాంద్రాయణగుట్టలోని లలితాబాగ్‌లో అక్బరుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయం ముగుస్తుండటంతో.. సమయం పూర్తయిందని, ఇక ప్రసంగం ఆపేయాలని స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ అక్బరుద్దీన్‌కు సూచించారు. దీంతో అక్బరుద్దీన్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర కూడా వాచ్ ఉందని, ఇంకా సమయం ఉందని బెదిరింపు ధోరణిలో సమాధానం ఇచ్చారు.

ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ.. సీఐకి చేయి చూపిస్తూ మీదకు దూసుకెళ్లబోయారు. తనను ఆపేవాళ్లు ఇంకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని అక్బరుద్దీన్ సీఐపై మండిపడ్డారు. తాను ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న తన అనుచరులు నిన్ను పరిగెత్తిస్తారంటూ.. వార్నింగ్ ఇచ్చారు.

కాగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవాళ సంతోష్ నగర్ పోలీసులు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 353తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ విషయంలో తన తప్పేమీ లేదని తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ వివరణ ఇచ్చారు. తాను రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. అయితే సమయం ముగియకముందే స్టేజీ పైకి వచ్చిన సీఐ సమయం ముగిసిందంటూ.. తనకు వాచ్ చూపించాడని చెప్పారు.

ఈ విషయంలో సీఐదే తప్పని.. తన తప్పు ఏమీ లేదని అక్బరుద్దీన్ అన్నారు. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ స్టేజీ వద్దకు వచ్చి తనకు వాచ్ చూపించిన ఘటనకు సంబంధించిన వీడియోను ఎన్నికల అధికారికి పంపించి ఫిర్యాదు చేసినట్లు అక్బరుద్దీన్ తెలిపారు.

First Published:  22 Nov 2023 9:37 PM IST
Next Story