జూబ్లీహిల్స్‌లో పోటీకి ఎంఐఎం సై.. ఏంటీ కొత్త ట్విస్ట్..?
మజ్లిస్ పార్టీ 2014లోనూ జూబ్లీహిల్స్‌లో పోటీ చేసింది. అది కూడా హిందూ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు టికెట్టిస్తే ఏకంగా 41,656 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
పాతబస్తీలోని తమ 7 స్థానాలతో పాటు అటు రాజేంద్రనగర్, ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించడం కొత్త ప్రశ్నలు తెరపైకి తెచ్చింది. జూబ్లీహిల్స్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు బీఆర్ఎస్ టికెటిచ్చేసింది. కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పి.విష్ణువర్ధన్‌రెడ్డిని పక్కనపెట్టి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు అవకాశమిచ్చింది. ఇప్పుడు ఇక్కడ మజ్లిస్ అభ్యర్థిని నిలబెడితే ముక్కోణపు పోటీ ఏర్పడుతుందా..? లేకపోతే ఓట్లు చీల్చి బీఆర్ఎస్‌కు మేలు చేసేందుకే ఎంఐఎం రంగంలోకి దిగుతుందా అనేది ఆసక్తికరం.
ఇదీ చరిత్ర
నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొలిసారి పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్‌రెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయభేరి మోగించారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి గోపీనాథ్ బీఆర్ఎస్‌లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు.
మజ్లిస్ టికెట్ హిందూ అభ్యర్థికా.. ముస్లింలకా?
మజ్లిస్ పార్టీ 2014లోనూ జూబ్లీహిల్స్‌లో పోటీ చేసింది. అది కూడా హిందూ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు టికెట్టిస్తే ఏకంగా 41,656 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. జూబ్లీహిల్స్ స్థానంలో షేక్‌పేట, యూసఫ్‌గూడ, బోరబండ డివిజన్లలో భారీగా ఉన్న ముస్లిం ఓటర్లు ఎంఐఎంకి ఓట్లేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చి ముస్లిం అభ్యర్థి అజారుద్దీన్‌ను రంగంలోకి దింపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లతోపాటు ముస్లిం ఓట్లు కూడా కలిసొచ్చి గెలుస్తామని లెక్కలేస్తోంది. దీనికి చెక్ పెట్టి ముస్లిం ఓట్లలో చీలిక తెచ్చేందుకే మజ్లిస్ ఇక్కడ పోటీ చేస్తుందా తద్వారా తమ మిత్రపక్షం బీఆర్ఎస్ గెలుపుకోసం ప్రయత్నిస్తుందా అనే చర్చ మొదలైంది.
అలా జరిగితే బీఆర్ఎస్‌కు ప్లస్‌పాయింటే!
మజ్లిస్ ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దింపితే ఆ వర్గం ఓట్లలో కచ్చితంగా చీలిక వస్తుంది. కాంగ్రెస్, మజ్లిస్‌ల మధ్య ముస్లిం ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ గెలుపు ఈజీ అవుతుంది. కానీ, నిజంగా మజ్లిస్ తామే గెలవాలనుకుంటే 2014లో మాదిరిగా హిందూ అభ్యర్థికి ఇస్తే అప్పుడు ఇక్కడ పోటీ కచ్చితంగా ట్రయాంగిల్ అవుతుంది. ఎవరు గెలిచినా అతికష్టం మీద బయటపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.