Telugu Global
Telangana

పక్కా ప్లాన్‌తో బరిలోకి MIM.. ఈసారి ఆ సీట్లే టార్గెట్..!

రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. రాజేంద్రనగర్‌ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరు ఫలక్‌నుమాకు చెందిన ప్రముఖ రియల్టర్ ఉన్నారని సమాచారం.

పక్కా ప్లాన్‌తో బరిలోకి MIM.. ఈసారి ఆ సీట్లే టార్గెట్..!
X

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా ప్లాన్‌తో బరిలో దిగుతోంది MIM. ఈసారి హైద‌రాబాద్ సిటీలోని 9 స్థానాలతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలోని మరో రెండు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని MIM పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వారిలో యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌లకు ఈసారి టికెట్ ఇవ్వరని సమాచారం.

వీరి స్థానంలో మాజీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్, సయ్యద్ ముస్తాక్ అహ్మద్, యాసర్ అరాఫత్‌, సోహైల్ ఖాద్రీ లాంటి సీనియర్ల పేర్ల‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. రాజేంద్రనగర్‌ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరు ఫలక్‌నుమాకు చెందిన ప్రముఖ రియల్టర్ ఉన్నారని సమాచారం.

ఈసారి యాకుత్‌పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, కార్వాన్‌, మలక్‌పేట, నాంప‌ల్లితో పాటు రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ స్థానాల్లోనూ పోటీ చేయాలని MIM భావిస్తోంది. రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ముస్లిం ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం. నిజామాబాద్ అర్బన్‌, నిర్మల్ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు MIM ప్లాన్ చేస్తోంది. MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యర్థుల లిస్ట్‌పై ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు.

First Published:  23 Oct 2023 7:54 AM GMT
Next Story