Telugu Global
Telangana

'పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో.. మళ్లీ గెలిచాక తొలి కేబినెట్‌లో ఇదే మొదటి సంతకం'

తొలి కేబినెట్‌లోనే దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేస్తాన‌ని సీఎం కేసీఆర్ చెప్పారు.

పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో.. మళ్లీ గెలిచాక తొలి కేబినెట్‌లో ఇదే మొదటి సంతకం
X

తెలంగాణలో మూడో సారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్లీ గెలిచిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలో తప్పకుండా పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు ఇప్పుడు ఉన్న మెట్రోలను పొడిగించే ప్రాజెక్టుపై సంతకం చేస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. పటాన్‌చెరులో రూ.183 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 200 ప‌డ‌క‌ల‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

హైదరాబాద్ నగరం రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఎంతో మంది నగరంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహేశ్వరం వెళ్తే మంత్రి సబిత ఇంద్రారెడ్డి కూడా మెట్రో విషయాన్ని నా దృష్టికి తీసుకొని వస్తే.. తప్పకుండా శంషాబాద్ నుంచి పొడిగించుకుందామని మాటిచ్చాను. ఇప్పుడు కూడా ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోను పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ పొడిగించుకుందామని సీఎం కేసీఆర్‌ మాటిచ్చారు. మళ్లీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఆ ప్రభుత్వంలో నిర్వహించే తొలి కేబినెట్‌లోనే దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు.

పటాన్‌చెరు ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. గత ప్రభుత్వాల పాలనలో విప‌రీతంగా విద్యుత్ కోతలు, పవర్ హాలీ డేలు ఉండేవి. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం.. దేశంలో తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ చెప్పారు.

ఒకప్పుడు పరిశ్రమలకు సరిపడా విద్యుత్ ఇవ్వడం లేదని కార్మికులు రోడ్లపై సమ్మెలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఏనాడూ అలాంటి సమ్మెలు జరగలేదని కేసీఆర్ చెప్పారు. గతంలో ఉన్నంత కాలుష్యం.. ఇప్పుడు పరిశ్రమల నుంచి వెలువడటం లేదు. దీనికి అధికారులు, కార్మికుల కృషే కారణం అని సీఎం చెప్పారు. ఈనాడు నిరంతర విద్యుత్ మాత్రమే కాకుండా.. నిరంతర మంచి నీటి సరఫరా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు. సభకు వచ్చిన ఉత్తర భారత దేశానికి చెందిన కార్మికులు, ఉద్యోగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎకరా భూమి అమ్మితే ఆ డబ్బులు దేనికీ పనికి రావు అని గత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అదే చంద్రబాబు ఇటీవల హైదరాబాద్, తెలంగాణ భూముల ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని అంటున్నారు. తాను పక్క రాష్ట్రాన్ని తక్కువ చేయడం లేదు. కానీ, తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగితే.. ఆ మేరకు భూముల ధరలు పెరుగుతాయో ప్రజలు గమనించాలని కోరారు.

పటాన్‌చెరు ఇప్పుడు పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసింది. అంతే కాకుండా.. ఈ నియోజకవర్గంలో అనేక పంచాయతీలు కూడా ఉన్నాయి. కాబట్టి త్వరలోనే పటాన్‌చెరు రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.


First Published:  22 Jun 2023 10:00 AM GMT
Next Story