నకిలీ నోట్ల చెలామణి ముఠా గుట్టురట్టు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
లక్ష రూపాయల అసలు నోట్లకు నాలుగు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికి మండలంలోని పెద్దగుండు ప్రాంతానికి అతన్ని రప్పించుకున్నారు. అతను అక్కడికి రాగానే ఆ డబ్బు తీసుకొని పారిపోయారు.
నకిలీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టయింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు నోట్లకు బదులుగా నాలుగు రెట్లు నకిలీ నోట్లు ఇస్తామంటూ ఆశ చూపించి వారు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మెట్‌పల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం డీఎస్పీ ఉమామహేశ్వరరావు వెల్లడించారు.
జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్, బిట్టు శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన మగ్గిడి కిషన్, కలకుంట్ల గంగారాం, బొంగురాల మల్లయ్య, మునిమానికల అశోక్ సులభంగా డబ్బు సంపాదించడానికి ముఠాగా ఏర్పడ్డారు. అసలు నోట్లు తీసుకొని బదులుగా పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసేలా పథకం రచించారు. ఇందులోభాగంగా పలువురి నుంచి ముఠాకు చెందిన ఇద్దరు అసలు నోట్లు తీసుకుంటుండగా.. మరో ఇద్దరు అక్కడకు వచ్చి పోలీస్.. పోలీస్ అని అరుస్తూ సినీ ఫక్కీలో డబ్బులతో పారిపోతున్నారు.
ఈ నెల ఒకటో తేదీన మెట్‌పల్లికి చెందిన దాబా నిర్వాహకుడు రాజేందర్‌ను మోసం చేశారు. లక్ష రూపాయల అసలు నోట్లకు నాలుగు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికి మండలంలోని పెద్దగుండు ప్రాంతానికి అతన్ని రప్పించుకున్నారు. అతను అక్కడికి రాగానే ఆ డబ్బు తీసుకొని పారిపోయారు. దీనిపై బాధితుడు మరుసటిరోజు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. నిందితుల పట్టణ శివారులోని వెంకట్రావుపేట వద్ద ఓ దాబాలో ఉన్నట్టు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు. నిందితులు ఆరుగురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.500 నకిలీ నోట్లు రూ.7 లక్షల మేరకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు, బైక్, ఆరు సెల్‌ఫోన్లు, రూ.5 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంతకుముందు కూడా ఇదే తరహాలో హైదరాబాద్‌లో ముగ్గురిని, ధర్మపురి, జగిత్యాల, కరీంనగర్, జన్నారంలలో ఒక్కొక్కరి చొప్పున మోసం చేసి సుమారు రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ నేపథ్యంలో ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసుల సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.