మోటార్లకు మీటర్లు.. రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్
మునుగోడు ఉప ఎన్నికకు ముందు మోటర్లు, మీటర్ల విషయంలో నోరుజారి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారాయన.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో బీజేపీ, అన్నదాతల ఆగ్రహాన్ని కాచుకోవాలని చూస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని ఏపీ వంటి రాష్ట్రాలు స్వాగతించినా తెలంగాణ ససేమిరా అంది. మోటర్లకు మీటర్లు అంటే అది రైతులకు ఉరితాడేనని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికకు ముందు మోటర్లు, మీటర్ల విషయంలో నోరుజారి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారాయన.
రైతులకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఉచిత విద్యుత్ ఇవ్వండి, కానీ మీటర్లు పెట్టి ఎవరి లెక్క ఎంతో తేల్చండి అంటోంది కేంద్రం. అలా అయితేనే కేంద్రం నుంచి సాయం అందుతుందని తేల్చి చెప్పింది. దీనికి ఒప్పుకోని కారణంగా ఇప్పటికే తెలంగాణకు ఆర్థిక సాయం ఆపేసింది. ఈ క్రమంలో రైతులనుంచి వ్యతిరేకత మొదలవడంతో కేంద్రం కూడా కాస్త వెనక్కి తగ్గింది, మోటర్లకు మీటర్లు పెడతామని తామెక్కడా చెప్పలేదని బుకాయిస్తోంది. కానీ రాజగోపాల్ రెడ్డి ఆ బుకాయింపుని పక్కనపెట్టి అసలు విషయం బయటపెట్టారు. మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని అంటున్నారు.
గతంలో కాంగ్రెస్ లో ఉండగా వ్యవసాయ రంగాన్ని కేంద్రం నాశనం చేస్తుందనే విషయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు కాషాయ కండువా మెడలో పడగానే రైతులు పగవారైపోయారు. అందుకే మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్టు చెబుతున్నారు. ఉప ఎన్నిక ఇలాంటి స్టేట్ మెంట్లతో రైతన్నల ఆగ్రహాన్ని రాజగోపాల్ రెడ్డి ఎదుర్కోడానికి సిద్ధమైనట్టే చెప్పాలి. బీజేపీకి ఓట్లు వేసి మీటర్లతో మోసపోతారో.. టీఆర్ఎస్ కి ఓట్లు వేసి అన్నదాతలకు అండగా నిలబడతారో మీరే తేల్చుకోండి అంటున్నారు అధికార పార్టీ నేతలు. మరి నోరుజారిన రాజగోపాల్ రెడ్డి కవరింగ్ గేమ్ మొదలుపెడతారేమో చూడాలి.