Telugu Global
Telangana

ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే టీఎస్ఆర్టీలో పని చేసే ఉద్యోగులు, కార్మికులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు.

ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి భేటీ సోమవారం నిర్వహించారు. దాదాపు 5 గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 3 నుంచి జరుగనున్న శాసన సభ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే టీఎస్ఆర్టీలో పని చేసే ఉద్యోగులు, కార్మికులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్‌గా కొనసాగుతున్న టీఎస్ఆర్టీసీ.. బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వంలోని రవాణా శాఖలో భాగం కానున్నది. ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు లభించే అవకాశం ఉన్నది. టీఎస్ఆర్టీసీని విలీనం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించడానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్టీసీ, కార్మిక శాఖ, జీఏడీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. విలీనం ద్వారా దాదాపు 43వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1932లో నిజాం రాష్ట్ర రైల్వే శాఖలో భాగంగా.. ఇండియాలోనే తొలి సారి ప్రభుత్వ రంగ రోడ్డు రవాణా సంస్థగా ఏర్పడింది. నిజాం రాష్ట్ర రైల్వే-రోడ్డు రవాణా శాఖగా అది చాలా కాలం పాటు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఏపీఎస్ఆర్టీసీగా మారింది. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత కాలం ఏపీఎస్ఆర్టీసీగానే ఉన్న సంస్థ.. 2015 జూన్ 3న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతం చెందింది.

First Published:  31 July 2023 8:23 PM IST
Next Story