ఆ కారణంగానే రాజకీయాల నుంచి వైదొలిగా - చిరంజీవి
మెగాస్టార్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్న చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. తిరిగి ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాతే మళ్లీ పూర్వ గౌరవాన్ని సంపాదించుకున్నారు.
ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయని.. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాలనుంచి వైదొలగాల్సి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అధికారమే లక్ష్యంగా పార్టీ పెట్టిన చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 స్థానాలకే పరిమితమై ఓటమి చెందారు.
చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తలోనే తాను సరికొత్త రాజకీయాలను చేస్తానని ప్రకటన చేశారు. ఎవరిపై తాను వ్యక్తిగత విమర్శలు చేయనని, పాలనలో లోపాలను మాత్రమే ఎత్తిచూపుతానని ప్రకటించారు. అందుకు తగ్గట్టే పార్టీ పెట్టిన కొత్తలో చిరంజీవి వ్యవహరించినప్పటికీ, ఆయనకు మాత్రం వ్యక్తిగత విమర్శలు ఎదురయ్యాయి. అంతకుముందు తన సహచరులుగా ఉన్న విజయశాంతి, రోజా వంటి వారు కూడా చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత చిరంజీవి పార్టీని నడపకుండా కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందడంతో అన్ని పార్టీలకు చిరంజీవి టార్గెట్ గా మారి తీవ్ర విమర్శలకు గురయ్యారు. మెగాస్టార్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్న చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. తిరిగి ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాతే మళ్లీ పూర్వ గౌరవాన్ని సంపాదించుకున్నారు.
ఈ నేపథ్యంలో తాను రాజకీయాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో తాజాగా చిరంజీవి ప్రకటించారు. పద్మ అవార్డులను దక్కించుకున్న వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. అందులో భాగంగా చిరంజీవిని కూడా ప్రభుత్వం సన్మానించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, వ్యక్తిగత విమర్శలు తగవని అన్నారు.
ఇప్పటి రాజకీయాలన్నీ వ్యక్తిగత దూషణలతోనే నడుస్తున్నాయని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు భరించలేకే తాను రాజకీయాలనుంచి వైదొలగాల్సి వచ్చిందని చిరంజీవి తెలిపారు. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను వారి భాషలోనే తిప్పి కొట్టే విధంగా ఉన్నవారే ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగగలరని అభిప్రాయపడ్డారు. తానెందుకు రాజకీయాలనుంచి వైదొలగాల్సి వచ్చిందో రాజకీయాలను వీడిన పదేళ్ల తర్వాత చిరంజీవి ప్రకటించారు.