వాటిని సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్.. - మెగా ఫ్యాన్స్‌కు సీపీఐ నారాయణ విజ్ఞాపన
అంతేకాక చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చిల్లరగాడంటూ ఘాటుగా మాట్లాడారు. దీంతో మెగా ఫ్యాన్స్ కు మండింది. నారాయణను ఓ ఆట ఆడుకున్నారు.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సీపీఐ నేత నారాయణ.. ఇటీవల మరోసారి నోరు జారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని, అతడు చిల్లర బేరగాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివాదాలు నారాయణకు కొత్తకాదు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని అనేవాళ్లు లేకపోలేదు. కమ్యూనిస్టు అయిఉండి.. విశాఖ శారదా పీఠాధిపతిని కలుసుకోవడం. బిగ్ బాస్ వంటి షోల మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటే. అయితే ఇటీవల ఆయన మెగాస్టార్ మీద పడ్డారు.
ఇటీవల ప్రధాని మోదీ ఏపీలోని భీమవరంలో పర్యటించి అక్కడ అల్లూరి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టార్ ను కూడా ఆహ్వానించారు. మెగాస్టార్ ను పిలవడం నారాయణకు అస్సలు నచ్చలేదట. సినిమాలో అల్లూరి పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణను వదిలేసి మెగాస్టార్ ను ఎలా పిలుస్తారంటూ నారాయణ అలిగారు. అంతేకాక చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చిల్లరగాడంటూ ఘాటుగా మాట్లాడారు. దీంతో మెగా ఫ్యాన్స్ కు మండింది. నారాయణను ఓ ఆట ఆడుకున్నారు.
గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో నారాయణను తిట్టి పోస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. ఈ విషయం రచ్చ రచ్చగా మారింది. మరోవైపు చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గడ్డితినేవాడని వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసేసరికి నారాయణ ఉలిక్కిపడినట్టున్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను చిరంజీవిని తిట్టిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. వాటిని మీరు సీరియస్‌గా తీసుకోకండి. మర్చిపోండి' అంటూ మెగా ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ జరగవలసిన నష్టం జరిగిపోయింది.