Telugu Global
Telangana

సొంత పార్టీ నేతలపైనే సునీల్ వ్యతిరేక ప్రచారం- రేవంత్‌పై భగ్గుమన్న సీనియర్లు

కొంతమంది నాయకులను అవమానించడానికే అన్నట్టుగా కొత్త పీసీసీ కమిటీ కూర్పు ఉందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా చాలా బాధ కలిగించే విషయాలను కూడా సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు.

సొంత పార్టీ నేతలపైనే సునీల్ వ్యతిరేక ప్రచారం- రేవంత్‌పై భగ్గుమన్న సీనియర్లు
X

టీ-కాంగ్రెస్‌లో ముసలం ముదురుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లంతా ఏకమయ్యారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం అయిన టీ కాంగ్రెస్‌ సీనియర్లు.. ఇకపై వలస నాయకుడి సంగతి తేల్చాలని నిర్ణయించుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. అసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయలేకపోవడం బాధగా ఉందన్నారు. ఏడాది కాలంగా సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్‌ సీనియర్లకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. పార్టీలో బలమైన నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీయడం ద్వారా వారిని దెబ్బకొట్టి.. కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోడానికో.. లేదా కాంగ్రెస్‌ను ఇతర పార్టీల చేతుల్లో పెట్టడానికో కొందరు కుట్రలు చేస్తున్నారని భట్టి ఆరోపించారు. అలాంటి వారిపై సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

కొంతమంది నాయకులను అవమానించడానికే అన్నట్టుగా కొత్త పీసీసీ కమిటీ కూర్పు ఉందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా చాలా బాధ కలిగించే విషయాలను కూడా సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపులు సహజమేనని.. కానీ ఎప్పుడూ కూడా ఇప్పటిలాగా '' పార్టీలో మొత్తం నా వాళ్లే ఉండాలి.. నేనే అన్ని పోస్టులు భర్తీ చేసుకోవాలని, నేనే కాంగ్రెస్‌ను స్వాధీనం చేసుకోవాలి. నాకు ఎదురుతిరిగిన వారిని అణచివేయాలి'' అన్న ధోరణి లేదన్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. డిపాజిట్లు రాని చోట్ల అభ్యర్థుల ఎంపిక ఫైనల్‌ అయిపోయిందని.. గెలిచే చోట్ల మాత్రం ఇంకా ఏకాభిప్రాయం రాలేదంటున్నారని ఇదెక్కడి విచిత్రమని ఉత్తమ్ ప్రశ్నించారు.

సూర్యపేట, నిర్మల్, సంగారెడ్డి, ఖమ్మం, భూపాల్ పల్లి లాంటి చోట్ల ఏకభిప్రాయం రాలేదని చెప్పడం చాలా బాధకరమన్నారు. బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని ఇంత భారీ సంఖ్యలో పదవులు ఇవ్వడం కూడా కాంగ్రెస్‌కు మంచిదికాదన్నారు. పార్టీ పదవులు వచ్చిన మొత్తం 108 మందిలో 54 మంది టీడీపీ వారే ఉంటే ఇక కాంగ్రెస్ శ్రేణులకు ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని ప్రశ్నించారు. పదవులు వచ్చిన వారిలో ఎవరెవరు ఎన్ని పార్టీలు మారి వచ్చారో అధిష్టానానికి వివరిస్తామన్నారు.

తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వీరంతా కోవర్టులు అని పోస్టు పెట్టారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఈ గలీజు పోస్టులు పెట్టిస్తున్నది ఎవరో తమకు తెలియదనుకుంటున్నారా అని ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. తొలి నుంచి ఉన్న తాము కాంగ్రెస్‌ను నాశనం చేసేవారమా? నాలుగు పార్టీలు మారి వచ్చిన వారు కాంగ్రెస్‌ను రక్షించే వారా అని ఫైర్ అయ్యారు.

సునీల్ కనుగోలును అరెస్ట్ చేస్తే కాంగ్రెస్‌ నేతలు కూడా అక్కడికి వెళ్లి నిరసన తెలిపారని.. సునీల్‌ టీఆర్‌ఎస్, బీజేపీతో పాటు తనపైన కూడా నెటిటివ్‌గా ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనరే తనతో చెప్పారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన నడిచే సోషల్ మీడియాలో తనపైన కూడా ఎలా వ్యతిరేక పోస్టులు పెట్టిస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు.

ప్రస్తుతం టీ-కాంగ్రెస్‌లో వలస వచ్చిన నాయకులకు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు మధ్య పంచాయితీ నడుస్తోందని మధుయాష్కి వివరించారు. సీఎల్‌పీ నాయకుడైన భట్టి విక్రమార్కను కూడా అవమానించేలా నాయకత్వం వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌ చెట్టుపై ఉంటూ సోషల్ మీడియా ద్వారా కొమ్మలు నరికే కుట్ర చేస్తున్నారన్నారు. అసలు కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతల చిత్తశుద్దిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. ''ఆయన''కు అనుకూలంగా ఉన్న పత్రికలు, చానళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మధుయాష్కి హెచ్చరించారు. పీజేఆర్ కుమారుడికి కూడా ఎలాంటి పదవి ఇవ్వకపోవడం ఏమిటని మధుయాష్కి ప్రశ్నించారు.

వలస నాయకులు పార్టీలోకి వచ్చిన తర్వాతనే కోవర్టులు అన్న ప్రచారం కాంగ్రెస్‌ సీనియర్లపై మొదలైందని జగ్గారెడ్డి విమర్శించారు. వలస వచ్చిన నాయకులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా తీర్మానం చేసి అడ్డుకున్నారన్నారు. కానీ తాను, దామోదర్‌ నరసింహ కలిసి అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్‌కు ఉన్న ఓట్ల కంటే 8 ఓట్లు ఎక్కువ తెచ్చామన్నారు. అలాంటి మాపై కోవర్టులు అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో అభ్యర్థిని నిలబెట్టి భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌కు ఉన్న ఓట్ల కంటే 200 ఓట్లు ఎక్కువ తెచ్చారని అలాంటి వ్యక్తిని కూడా కోవర్ట్ అంటూ వలస నాయకులు ప్రచారం చేయిస్తున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

తాను, దామోదర్ రాజనరసింహ భారీగా డబ్బు ఖర్చు పెట్టుకుని రాహుల్ జోడో యాత్రను విజయవంతం చేస్తే తిరిగి నిన్నటి నుంచి తమపై కోవర్టులు అంటూ ప్రచారం మొదలుపెట్టారన్నారు. ఈ దరిద్రం ఏంది అని జగ్గారెడ్డి ఆవేదన చెందారు.

First Published:  17 Dec 2022 9:12 AM GMT
Next Story