స్తంభించిన మీసేవ సేవలు..విద్యార్థులు ఇక్కట్లు
10 రోజులుగా తెలంగాణలో మీసేవ సేవలు స్తంభించిడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 10 రోజులుగా పలు చోట్ల మీ సేవ సేవలు స్తంభించాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. డేటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా మీ సేవ సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా వివిధ రకాల ప్రభుత్వ సేవలను మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. 38 ప్రభుత్వ శాఖలకు చెందిన 200 వరకు సేవలు 2,856 మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ఇందులో రెవెన్యూశాఖ నుంచి విద్యార్థులు, ఉద్యోగార్థులు పొందాల్సిన కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ తదితర సర్టిఫికెట్లు అతి ప్రధానమైనవి. దీంతో మీ సేవలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పలు ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షణ చేస్తున్నారు. దీంతో పలు సర్టిఫికెట్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.