Telugu Global
Telangana

మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యా ప్రయత్నం వ్యవహారం: ర్యాగింగ్ సాధారణమేనని DME వివాదాస్పద వ్యాఖ్యలు

మరో వైపు నిమ్స్ దగ్గర కూడా విద్యార్థులు, గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి. నిమ్స్ వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియజేయడంలేదని వారు ఆరోపించారు. ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో పోలీసులకు నిరసనకారులకు మధ్య పరస్పరం తోపులాట జరిగింది.

మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యా ప్రయత్నం వ్యవహారం: ర్యాగింగ్ సాధారణమేనని DME వివాదాస్పద వ్యాఖ్యలు
X

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ సైఫ్ అనే వ్యక్తి వేధింపులు భరించలేక ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రయత్నించిన‌ ప్రీతి అనే వైద్య విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ లో ఆమె కు చికిత్స అందిస్తున్నారు.

కాకతీయ మెడికల్ కాలేజీలో ఈ రోజు కూడా విద్యార్థులు క్లాస్ లను బైకాట్ చేశారు. సైఫ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రీతిని సైఫ్ తీవ్రంగా అవమానిస్తూ ర్యాగింగ్ చేసినప్పటికీ, ఈ విషయంపై ప్రీతి తండ్రి ప్రిన్సిపాల్ కు పిర్యాదు చేసినా ఆయన పట్టించుకోకపోవడంపై విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు.

మరో వైపు నిమ్స్ దగ్గర కూడా విద్యార్థులు, గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి. నిమ్స్ వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియజేయడంలేదని వారు ఆరోపించారు. ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో పోలీసులకు నిరసనకారులకు మధ్య పరస్పరం తోపులాట జరిగింది. దీంతో నిమ్స్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ లోనికి వెళ్లకుండా ఆసుపత్రి గేట్లు పోలీసులు మూసేశారు.

కాగా, ప్రీతి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీసేందుకు డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) రమేష్ రెడ్డి నిమ్స్‌ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల్లో ఫస్ట్, సెకండియర్‌లో ర్యాగింగ్ సాధారణమేనన్నారు. అయితే పీజీలో ర్యాగింగ్ ఉండదని, కేఎంసీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని ఆయన అన్నారు. ఈ సంఘట్నపై విచారణకు కమిటీ వేశామని కమిటీ రిపోర్ట్ వచ్చాక చర్యలు చేపడ్తామని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ ఘటనపై కాలేజీ ప్రిన్స్‌పల్ సైఫ్ ను, ప్రీతిని పిలిచి కౌన్సిలింగ్ చేశారని రమేష్ రెడ్డి అన్నారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. ఆమె సీనియర్ అయిన సైఫ్ ప్రీతిని మూడు నెలలుగా తీవ్రంగా అవమానిస్తున్నాడు. రకరకాలుగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి చెప్పుకొని బాధపడింది.

బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ప్రీతి కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. ఆమె మత్తు ఇంజక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రీతిని హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆమెఅవయాలేవీ పనిచేయడం లేదని, వెంటిలేటర్ మీదనే ఆమె ఉన్నదని, వైద్యానికి స్పందించడంలేదని వైద్యులు తెలిపారు.

First Published:  23 Feb 2023 7:27 PM IST
Next Story